నీళ్లు ఎక్కువగా తాగితే కిడ్నీ వ్యాధి నయం అవుతుందా?

8
- Advertisement -

చాలా మందికి ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీ వ్యాధి తగ్గిపోతుంది అని నమ్ముతుంటారు. కానీ నెఫ్రాలజీ నిపుణులు చెబుతున్నదేమిటంటే, నీరు కిడ్నీ ఆరోగ్యానికి అవసరం అయినప్పటికీ దెబ్బతిన్న కిడ్నీలను మళ్లీ బాగు చేయలేదని, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని నయం చేయలేదని స్పష్టం చేస్తున్నారు.

మన శరీరంలో కిడ్నీలు రక్తంలో ఉన్న వ్యర్థాలు మరియు అదనపు ద్రవాలను తొలగించే ముఖ్యమైన పని చేస్తాయి. ఈ ప్రక్రియను ఫిల్ట్రేషన్ అంటారు. ఈ వ్యర్థాలు మూత్రం రూపంలో బయటకు వెళ్తాయి. ఈ ప్రక్రియలో నీరు కీలక పాత్ర పోషిస్తుండటంతో, ఎక్కువగా నీళ్లు తాగితే కిడ్నీ సమస్యలు “ఫ్లష్ అవుతాయి” అనే నమ్మకం సోషల్ మీడియాలో ఎక్కువగా వ్యాపించింది.

నీరు ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ అది కిడ్నీ సమస్యలకు మందు కాదు. సరిపడా నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ లేదా కిడ్నీ రాళ్ల వంటి సమస్యలను నివారించవచ్చు. కానీ ఇప్పటికే ఉన్న కిడ్నీ వ్యాధిని అది తిరిగి సరిచేయదు అని స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే కిడ్నీ వ్యాధి సాధారణంగా ఒక్కసారిగా రాదు. చాలా సందర్భాల్లో కొన్ని ఇతర వ్యాధుల కారణంగా కాలక్రమేణా కిడ్నీలు దెబ్బతింటాయి.

ముఖ్య కారణాలు:

డయాబెటిస్

అధిక రక్తపోటు

ఇన్ఫెక్షన్లు

ఆటో ఇమ్యూన్ వ్యాధులు

జన్యుపరమైన సమస్యలు

కిడ్నీలు ఒకసారి దెబ్బతింటే, ఎంత నీళ్లు తాగినా వాటిని తిరిగి సరిచేయలేం. కిడ్నీల్లో ఉన్న ఫిల్టర్ వ్యవస్థను నీరు మళ్లీ పునరుద్ధరించదు.ఇందుకోసం జీవనశైలిలో మార్పులు,రక్తపోటు, షుగర్ నియంత్రణ,తీవ్రమైన పరిస్థితుల్లో డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరం కావచ్చు.

Also Read:హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్‌ ఐలైన్‌ స్టూడియోస్‌

అవసరానికి మించి నీళ్లు తాగడం కూడా సమస్యలు కలిగించవచ్చు, ముఖ్యంగా కిడ్నీ వ్యాధి ఉన్నవారికి. ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల దెబ్బతిన్న కిడ్నీలు బాగుపడవు. పైగా కిడ్నీ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువ ద్రవం తీసుకోవడం వల్ల శరీరంలో వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అధిక రక్తపోటు లేదా ఊపిరితిత్తుల్లో ద్రవం చేరడం వంటి సమస్యలు రావచ్చు అని చెబుతున్నారు.

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న పెద్దలు రోజుకు 2–3 లీటర్ల ద్రవాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే కిడ్నీ వ్యాధి ఉన్నవారు డాక్టర్ సూచనల ప్రకారం మాత్రమే నీటి పరిమాణం నిర్ణయించుకోవాలి.

- Advertisement -