టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా వివాదంలో చిక్కుకున్నారు. జాతీయ పతాకాన్ని అవమానించారనే ఆరోపణలతో ఫిర్యాదు నమోదైంది. టీ20 వరల్డ్ కప్ 2026 విజయం అనంతరం జరిగిన వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని తగిన విధంగా గౌరవించలేదని పుణేకు చెందిన ఒక న్యాయవాది ఆరోపించారు.
పుణేకు చెందిన న్యాయవాది వాజిద్ ఖాన్ నమోదు చేశారు. వరల్డ్ కప్ ఫైనల్లో గెలిచిన అనంతరం జరిగిన సంబరాల్లో హార్దిక్ పాండ్యా తన స్నేహితురాలు మహికా శర్మతో కలిసి ఆనందం వ్యక్తం చేస్తూ జాతీయ పతాకాన్ని తన శరీరానికి చుట్టుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
వాజిద్ ఖాన్ మాట్లాడుతూ…1971 జాతీయ పతాక చట్టం ప్రకారం పతాక గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పౌరుడికి ఉందని తెలిపారు. కానీ హార్దిక్ పాండ్యా సంబరాల్లో మునిగిపోయి జాతీయ పతాకాన్ని వెనుక భాగంలో కట్టుకుని తన స్నేహితురాలితో కలిసి నృత్యం చేసినట్లు, అలాగే పతాకంతోనే నేలపై పడుకున్నట్లు వీడియోల్లో కనిపిస్తోందని అన్నారు. ఇది జాతీయ పతాకానికి అవమానమని ఆయన పేర్కొన్నారు.
Also Read:ప్రజల కోరిక మేరకే ‘కేరళం’గా మార్పు!
ఈ ఘటనపై పుణేలోని శివాజీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వాజిద్ ఖాన్ తెలిపారు. మొదట ఈ ఘటన అక్కడ జరగలేదని పోలీసులు చెప్పినా, జాతీయ పతాకం దేశానికి చెందినదని, ఎక్కడైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పడంతో పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కాపీ ఇచ్చినట్లు ఆయన చెప్పారు.

