పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ తీవ్ర హెచ్చరిక జారీ చేసింది. తమపై దాడులు కొనసాగితే ఈ ప్రాంతం నుంచి ఒక్క లీటరు చమురు కూడా ఎగుమతి అయ్యేలా అనుమతించమని ఇరాన్ ప్రకటించింది. ఈ హెచ్చరికను ఇరాన్ సైనిక విభాగమైన ఐఆర్జీసీ వెల్లడించింది. ఈ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు పెరిగాయి.
ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ ప్రెస్ టీవీ ప్రకారం, యుద్ధంలో పాల్గొంటున్న లేదా తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న దేశాలకు ఈ ప్రాంతం నుంచి చమురు సరఫరా జరగదని ఐఆర్జీసీ పేర్కొంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మూజ్‌పై ఈ హెచ్చరిక ప్రభావం చూపే అవకాశముంది. ఈ సముద్ర మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం రవాణా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో పాటు అమెరికా కూడా ఈ పరిస్థితుల్లో భాగస్వామిగా ఉండటంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇప్పటికే ఈ సంక్షోభం రెండో వారంలోకి ప్రవేశించింది. ఈ పరిణామాల కారణంగా హోర్ముజ్ జలసంధి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇదిలా ఉండగా అమెరికా అధ్యక్షుడు డోనాల్ట్ ట్రంప్ .. ఇరాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ప్రపంచానికి చమురు సరఫరా నిలిపివేయడానికి ఎలాంటి ప్రయత్నం చేసినా దాని పరిణామాలు తీవ్రముగా ఉంటాయని ఆయన అన్నారు. ప్రపంచాన్ని బందీగా ఉంచేలా ఒక ఉగ్ర పాలన చమురు సరఫరాను అడ్డుకోవడానికి నేను అనుమతించను అని ట్రంప్ స్పష్టం చేశారు.
ఇంకా మాట్లాడుతూ, ఇరాన్ ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆయుధాలను ఎక్కువగా ఉపయోగించిందని, ఇకపై మరింత ఉద్రిక్తత పెంచే చర్యలు చేపట్టకూడదని హెచ్చరించారు. ఇరాన్ ప్రపంచ చమురు సరఫరాను అడ్డుకునే ప్రయత్నం చేస్తే అది ఆ దేశానికి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని ఆయన అన్నారు.
Also Read:మైత్రీ మూవీ మేకర్స్.. ‘జెట్లీ’ షూటింగ్ పూర్తి
ట్రంప్ ప్రకారం ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి తెరిచే ఉన్నప్పటికీ, ప్రపంచానికి ఇంధన సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైతే ఆ కీలక సముద్ర మార్గంపై నియంత్రణ సాధించే అవకాశాన్ని అమెరికా పరిశీలిస్తోందని సూచించారు.
ఇరాన్ విదేశాంగ శాఖ కూడా తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. హోర్ముజ్ జలసంధి గుండా వెళ్లే చమురు ట్యాంకర్లు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించింది. ఈ ప్రాంతంలో ఇప్పటికే వాణిజ్య నౌకా రవాణాపై ప్రభావం పడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

