మంచి చేసి ప్రజల మనసు గెలవండి:కేటీఆర్

6
- Advertisement -

తాను మున్సిపల్ మంత్రిగా ఉన్న సమయంలో సిరిసిల్ల పట్టణ అభివృద్ధి కోసం సుమారు రూ.44 కోట్ల నిధులను మంజూరు చేశానని తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులను రద్దు చేయడం దురదృష్టకరమని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీపై ఉన్న రాజకీయ కోపంతోనే సిరిసిల్ల అభివృద్ధి కార్యక్రమాలను నిలిపివేశారని ఆరోపించారు.

ప్రజల మనసు గెలవాలంటే గత ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం కాకుండా, వాటికంటే ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని కేటీఆర్ అన్నారు. “నేను రూ.40 కోట్లు ఇస్తే మీరు రూ.80 కోట్లు ఇవ్వాలి. నేను ఒక మంచి పని చేస్తే మీరు రెండు మంచి పనులు చేయాలి. అంతేకానీ అభివృద్ధి పనులను రద్దు చేయడం సరైన పద్ధతి కాదు” అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండగా సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో తాటి చెట్టుపై పనిచేస్తూ గుండెపోటుతో మృతి చెందిన సాయిలి కిషన్ గౌడ్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి తన సానుభూతిని తెలిపారు.

ఈ సందర్భంగా సాయిలి కిషన్ గౌడ్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. కుటుంబంలో ఉన్న ఇద్దరు పిల్లల పేర్లపై రూ.2 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. అలాగే బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున అందాల్సిన అన్ని సహాయాలు త్వరగా అందేలా చూడాలని స్థానిక నాయకులకు సూచించారు.

కుటుంబాన్ని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనల్లో బాధితులకు అండగా నిలబడటం ద్వారా సమాజం తమ బాధ్యతను నెరవేర్చాలని ఆయన అన్నారు. స్థానికులు కూడా కేటీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.

Also Read:ట్రెండింగ్‌లో‘ధురంధర్: ది రివెంజ్’

- Advertisement -