ఇండస్ట్రియల్ పార్క్ భూసేకరణ..రైతుల ఆగ్రహం

2
- Advertisement -

వికారాబాద్ జిల్లా పరిగి మండలం పరిధిలోని కాళ్లపూర్, రాపోల్ గ్రామ పంచాయతీలలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు కోసం ప్రభుత్వం భూసేకరణకు నోటిఫికేషన్ జారీ చేయడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాతల కాలం నాటి నుండి ఈ భూముల మీదనే జీవనాధారం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు భూములు తీసుకుంటే తాము రోడ్డున పడతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామ పంచాయతీకి లేదా స్థానిక రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారని రైతులు ప్రశ్నిస్తున్నారు. తమ అభిప్రాయం తెలుసుకోకుండా తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో తమ భూములను స్వాధీనం చేసుకుంటే తమ కుటుంబాలు జీవనోపాధి కోల్పోతాయని వారు చెబుతున్నారు.

నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రాలు సమర్పించడంతో పాటు జిల్లా కలెక్టరేట్ ఎదుట కూడా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. తమ సమస్యను ప్రభుత్వం గమనించి వెంటనే న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు.

ఇక తమ జిల్లా నుండి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఇప్పుడు తమను రోడ్డున పడేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత రైతులకు మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి మద్దతు తెలిపారు. రైతుల సమస్యను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:రష్యా చమురు కొనుగోలు…భారత్‌కు మినహాయింపు

- Advertisement -