ప్రాణాలను పణంగా పెట్టి ప్రజల భద్రత కోసం పనిచేసిన ఒక పోలీస్ అధికారి రిటైర్ అయిన తర్వాత తన హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తే అది ఏ ప్రభుత్వానికైనా తలవంచే పరిస్థితి నెలకొందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. వర్ధన్నపేట ఎస్సైగా పనిచేసి 30-06-2025న రిటైర్ అయిన శ్రీనివాస్ గారి పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విధుల్లో గాయపడి ఇన్ఫెక్షన్ కారణంగా మోకాలి వరకు కాలు తొలగించుకోవాల్సి వచ్చిన ఆయన, సర్జరీ కోసం సుమారు రూ.25 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వం ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, ఆయనకు రావాల్సిన సుమారు రూ.60 లక్షల పెన్షన్ బెనిఫిట్స్ ఇప్పటికీ విడుదల కాకపోవడం తీవ్ర ఆవేదన కలిగిస్తోంది.
ఎనిమిది నెలలుగా తన రిటైర్మెంట్ బకాయిల కోసం ఎదురుచూస్తున్న శ్రీనివాస్ గారి కన్నీళ్లు ప్రభుత్వాన్ని కదిలించలేకపోవడం బాధాకరం. ఆయన ఒక్కరే కాదు, రాష్ట్రంలో అనేక మంది విశ్రాంత ఉద్యోగులు తమ హక్కుల కోసం కార్యాలయాలు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కొందరు బిడ్డల పెళ్లిళ్ల కోసం, మరికొందరు పిల్లల విద్య కోసం, ఇంకొందరు వైద్య ఖర్చుల కోసం తమ బెనిఫిట్స్ కోసం వేచి చూస్తున్నారు.
ఉద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు వారి సమస్యలను పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీస్తోంది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఆలస్యం కారణంగా పలువురు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Also Read:హైదరాబాద్‌ని కుప్పకూల్చింది రేవంత్ రెడ్డే:కేటీఆర్
తక్షణమే పెండింగ్ బకాయిలను విడుదల చేసి, శ్రీనివాస్ గారి వంటి వేలాది మంది రిటైర్డ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ స్పందన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.

