గురుకులాల్లో విద్యార్థులకు కల్తీ ఆహారం సమస్యపై ఎక్స్ వేదికగా ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు. కల్తీ ఆహారం మాకొద్దు అంటూ రోడ్డెక్కిన సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఎస్టీ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు … భోజనం బాగుండటం లేదని హైదరాబాద్ నడిగడ్డపై ఉన్న ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి నుంచి నిరసన తెలియజేస్తున్నారు విద్యార్థులు.
ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట జరుగుతున్నా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉలుకు లేదు, పలుకు లేదు.నిత్యం గాలి మోటార్లలో చక్కర్లు కొట్టే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, గరుకులాల్లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులపై సమీక్షించే తీరిక లేకపోవడం సిగ్గుచేటు.ఉస్మానియాకు వెళ్లి రిబ్బన్లు కట్ చేయడం తప్ప రెండున్నరేండ్లుగా చేసిన అభివృద్ది ఏముంది? అన్నారు.
మాటలు కోటలు దాటితే ఆచరణ గడప దాటది అనడానికి ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ ఉదాహరణ…రాష్ట్ర అభివృద్ది కోసమే అంటూ ఇప్పటి వరకు 62 సార్లు ఢిల్లీకి పోయిన రేవంత్ రెడ్డి నువ్వు సాధించిదేమిటో మొన్నటి కేంద్ర బడ్జెట్ తోనే తేటతెల్లమైంది.ఒకవైపు గురుకులాల ఖ్యాతిని మసకబార్చిన రేవంత్ రెడ్డి, మరో వైపు అంచనాలు పెంచి కమీషన్లు దండుకోవడానికే యంగ్ ఇండియా స్కూల్స్ పేరిట భారీ నాటకానికి తెరతీసిండు.కూట్లో రాయి తీయలేనోడు, ఏట్లో రాయి తీస్తడట అన్నట్లు ఉన్న గురుకులాల్లో పిల్లలకు మంచి భోజనం పెట్టలేని ప్రభుత్వం, అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పిస్తరట అని ప్రశ్నించారు.
Also Read:రెడ్ ఫోర్ట్ పేలుడు..కీలక నివేదిక!
పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి కల్పించడమేనా ఇందిరమ్మ రాజ్యం?,ఉస్మానియా విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా అవమానించడమేనా మీ ప్రజాపాలన? ,రేవంతు రెడ్డి.. పరిపాలన అంటే ప్రగల్భాలు పలకడం కాదు, ప్రతిపక్షాలపై బూతుల వర్షం కురిపించడం అంతకంటే కాదు.హార్వార్డ్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయానికి వెళ్లి వచ్చినా కూడా.. మీరు విద్య పట్ల, విద్యార్థుల పట్ల ప్రాధాన్యం చూపకపోవడం శోచనీయం.ఇప్పటికైనా విద్యాశాఖ మీద దృష్టి సారించి, గురుకుల విద్యార్థులకు పురుగుల్లేని భోజనం అందించాలని, ఉస్మానియా యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలకు పరిష్కారం చూపాలని బిఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

