టీ20 వరల్డ్‌కప్ 2026 లీగ్ దశలో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) నిర్ణయంపై యూ–టర్న్ తీసుకునే అవకాశంపై వస్తున్న కథనాలపై బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా స్పందించారు. ఈ విషయంలో తాను వ్యాఖ్యానించబోనని, తుది నిర్ణయం పూర్తిగా ఐసీసీ చేతుల్లోనే ఉందని ఆయన స్పష్టం చేశారు.
పీసీబీ భారత్ బహిష్కరణ నిర్ణయాన్ని పునరాలోచించేందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)తో చర్చలు ప్రారంభించిందన్న వార్తలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో శుక్లా ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ అంశాలపై నేను వ్యాఖ్యానించను. బీసీసీఐ తరఫున కూడా ఎలాంటి వ్యాఖ్యలు ఉండవు. ఈ వ్యవహారాన్ని పూర్తిగా ఐసీసీకి అప్పగించాం. ఐసీసీ తీసుకునే ఏ నిర్ణయాన్నైనా మేం గౌరవిస్తాం అని చెప్పారు.
ముందుగా పాకిస్తాన్ ప్రభుత్వం భారత్–శ్రీలంకలో జరిగే వరల్డ్‌కప్‌కు తమ జట్టుకు అనుమతి ఇచ్చినా, ఫిబ్రవరి 15న కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో భారత్‌తో జరిగే గ్రూప్ మ్యాచ్‌లో బరిలోకి దిగవద్దని ఆదేశించింది. అయితే తాజాగా యూ–టర్న్ అవకాశం ఉందని, మ్యాచ్ జరగవచ్చని కొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి.
ఈ నేపథ్యంలో ఐసీసీ డైరెక్టర్లు ఇమ్రాన్ ఖ్వాజా, ముబాషిర్ ఉస్మానీ లాహోర్ చేరుకుని పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వితో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం కూడా పాల్గొన్నారు. లాహోర్‌లోని గద్దాఫీ స్టేడియంలో జరిగిన ఈ త్రైపాక్షిక సమావేశం సమస్య పరిష్కారానికి దోహదపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read:ఎన్నికల ప్రచారం..మాజీ మంత్రి హరీష్ రికార్డ్

