ఇటీవల జరిగిన పరిణామాలతో జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డిపై పార్టీ అధిష్ఠానం సీరియస్గా ఉన్నట్లు తెలుస్తోంది. క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి అనంతరం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే సంజయ్కు సంబంధించి బీ ఫారం వివాదం చర్చనీయాంశంగా మారింది. సంజయ్ అనుచరులకు బీ ఫారం ఇచ్చి, తన అనుచరులకు ఇవ్వకుండా మోసం జరిగిందన్న ఆరోపణలతో జీవన్ రెడ్డి అసంతృప్తికి గురయ్యారని సమాచారం. ఈ నేపథ్యంలో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దింపడం పార్టీకి తీవ్ర నష్టాన్ని కలిగించిందని అధిష్ఠానం భావిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై పోటీ చేస్తున్న అభ్యర్థులను ఓడించేలా వ్యవహరించడం క్రమశిక్షణారాహిత్యంగా పరిగణించబడుతోందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా జీవన్ రెడ్డి లాంటి సీనియర్ నాయకుడు ఇలాంటి చర్యలకు పాల్పడటం పార్టీకి చెడు సంకేతమని అభిప్రాయపడుతున్నారు. వర్గపోరు కారణంగా ఒకరి అనుచరులను మరొకరు ఓడించడం కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని అధిష్ఠానం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ఇదే సమయంలో గద్వాల, మహబూబాబాద్ వంటి ఇతర ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు బహిర్గతమవుతోంది. రెబల్ అభ్యర్థుల బలం పెరగడంతో అధికారిక కాంగ్రెస్ అభ్యర్థులు ఓటమి పాలయ్యే ప్రమాదం ఉందని సీనియర్ నాయకులు భావిస్తున్నారు.
Also Read:Funky:‘ఫంకీ’ ట్రైలర్ అప్డేట్
ఈ పరిస్థితుల నేపథ్యంలో జగిత్యాలతో పాటు వర్గపోరు ఉన్న అన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఇన్చార్జి మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పార్టీ క్రమశిక్షణను కట్టుదిట్టం చేసి, అంతర్గత విభేదాలకు చెక్ పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్ అధిష్ఠానం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.

