రేవంత్ రెడ్డి ‘తిట్ల ట్రాప్’లో పడకండి:కేటీఆర్

7
- Advertisement -

కేవలం తన వైఫల్యాలను హామీల అమలును కప్పిపుచ్చుకోవడానికి కీలకమైన మున్సిపల్ ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తిట్ల దండకం అందుకున్నారని, రేవంత్ రెడ్డి తిట్ల ట్రాప్ లో పడవద్దని తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ గడ్డపై ప్రస్తుతం ఒక వికృతమైన రాజకీయ క్రీడ నడుస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పద్నాలుగేళ్ల సుదీర్ఘ పోరాటంతో, ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించి, మన స్వరాష్ట్ర స్వప్నాన్ని సాకారం చేసిన నాయకుడు కేసీఆర్ అని, ఒక తండ్రిలా ఈ రాష్ట్రాన్ని అక్కున చేర్చుకుని, పడావు పడ్డ తెలంగాణను ప్రగతి బాటలో నడిపించిన మహోన్నత శిల్పి ఆయనేనని కొనియాడారు. కేసీఆర్ గారు ఎప్పుడూ బిరుదుల కోసం, సన్మానాల కోసం పాకులాడలేదని, తెలంగాణ ప్రజల శ్రేయస్సు మరియు సంక్షేమమే ఆయనకు నిజమైన సత్కారమని కేటీఆర్ స్పష్టం చేశారు.

నేడు అధికార గర్వంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ గారి వ్యక్తిత్వం మీద విషం చిమ్ముతున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఇది కేవలం ఒక వ్యక్తి మీద జరుగుతున్న దాడి కాదని, తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద జరుగుతున్న దాడి అని ఆయన అభివర్ణించారు.రేవంత్ రెడ్డి పన్నుతున్న ‘తిట్ల ట్రాప్’లో పార్టీ శ్రేణులు ఎవరూ పడకూడదని ఆయన హెచ్చరించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చర్చ జరగాల్సింది.. వార్డుల్లోని మౌలిక వసతులు, రోడ్లు, డ్రైనేజీ మరియు ఇంటింటికీ అందాల్సిన పథకాల మీదనే కానీ, రేవంత్ రెడ్డి తన బూతు పురాణంతో అసలు చర్చను పక్కదోవ పట్టిస్తున్నారని దుయ్యబట్టారు.

ప్రజల కన్నీటిని తుడిచే దిశగా మన పోరాటం సాగాలని, అబద్ధపు ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎరువుల కోసం క్యూ లైన్లలో రైతులు పడుతున్న పాట్లు, రైతు భరోసా అందక ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల కోరల్లో చిక్కుకున్న అన్నదాతల కష్టాల గురించి గొంతెత్తాలని సూచించారు. అలాగే ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక చదువులు ఆగిపోతున్న బిడ్డల వేదనకు, గురుకులాల్లో విషాహారం తిని అల్లాడి పోతున్న పసి ప్రాణాలకు రేవంత్ రెడ్డే బాధ్యత వహించాలని, ఆయనను గల్లా పట్టి అడగాలని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న వృద్ధులు, డీఏలు మరియు పీఆర్సీ లేక నలిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగుల పక్షాన నిలబడాలని కేటీఆర్ కోరారు. సింగరేణి బొగ్గు స్కామ్, విద్యుత్ కుంభకోణాల వెనుక ఉన్న అసలు దొంగలెవరో ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలని, మన నీటి వాటాను పక్క రాష్ట్రాలకు ధారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి ‘కోవర్టు’ ద్రోహాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల తీర్పే కేసీఆర్ గారికి ఇచ్చే అసలైన గౌరవమని, పదేళ్ల ఉజ్వల ప్రగతి తర్వాత ఈ రెండేళ్లలో తెలంగాణ అనుభవిస్తున్న ఈ దుర్గతికి కారణాలను ప్రజల ముందుకు బలంగా తీసుకెళ్లాలని ఆయన కోరారు.చివరగా, తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఒక ధ్రువతార అని, ఆయన కీర్తి నిరంతరం వెలుగులీనుతూనే ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణకు ఇది ఒక గ్రహణ కాలమని, రేవంత్ అనే రాహువు నుండి రాష్ట్రాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి బిడ్డపై ఉందని గుర్తుచేశారు.రేవంత్ రెడ్డి అసమర్థ పాలనపై మున్సిపల్ ఎన్నికల్లో ప్రశ్నలను పిడుగుల్లా కురిపించాలని, ప్రజాస్వామ్యాన్ని కంటికి రెప్పలా కాపాడుకుందామని ఆయన పిలుపునిచ్చారు.

Also Read:వైసీపీ హిందూ ద్రోహి:నాగబాబు

- Advertisement -