టాలీవుడ్లో టైమ్ ట్రావెల్ కథాంశంతో రూపొందిన తొలి చిత్రంగా గుర్తింపు పొందిన ‘ఆదిత్య 369’ మరోసారి వార్తల్లో నిలిచింది. ‘గాడ్ ఆఫ్ మాసెస్’ నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘ఆదిత్య 999’ ఈ కల్ట్ క్లాసిక్‌కు సీక్వెల్‌గా రూపొందనుండటం విశేషం. 1991లో విడుదలైన ‘ఆదిత్య 369’ తెలుగు సినీ చరిత్రలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను పరిచయం చేసిన తొలి సినిమాగా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.
ఈ సినిమా ఏప్రిల్ 2025లో రీ–రిలీజ్ అయి మంచి స్పందన పొందింది. తాజాగా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటిటి ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు ఈ సినిమా కేవలం ఈటీవీ విన్లో మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్లోకి రావడంతో మరింత విస్తృత ప్రేక్షకులను చేరుకునే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వం వహించగా, సంభాషణలు జంధ్యాల అందించారు. మోహిని, అమ్రీష్ పూరి, చంద్ర మోహన్, అల్లు రామలింగయ్య, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో నటించారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించగా, ఇళయరాజా సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీదేవి మూవీస్ బ్యానర్‌పై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
Also Read:దుకాణాల్లో హైడ్రా రంగనాథ్ తనిఖీలు

