అమెరికాలో ఇమిగ్రేషన్ అధికారులు ఐదేళ్ల పసివాడిని నిర్బంధించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. చిన్నారి వయసును కూడా లెక్కచేయకుండా చేపట్టిన ఈ చర్యపై మానవ హక్కుల సంఘాలు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిన్నెసోటా రాష్ట్రంలో ప్రీస్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలో ఫెడరల్ ఇమిగ్రేషన్ అధికారులు చిన్నారితో పాటు అతడి తండ్రిని అదుపులోకి తీసుకున్నారు.
సమాచారం ప్రకారం, లియామ్ కోనెజో రామోస్ అనే ఐదేళ్ల బాలుడు 2024లో తన కుటుంబంతో కలిసి అమెరికాకు వలస వచ్చాడు. అయితే, ఆ కుటుంబానికి బహిష్కరణకు సంబంధించిన ఎలాంటి అధికారిక ఉత్తర్వులు జారీ కాలేదని తెలుస్తోంది. అయినప్పటికీ చిన్నారిని లక్ష్యంగా చేసుకుని అధికారులు చర్యలు తీసుకోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. “చట్ట అమలు పేరుతో పసివాళ్లను భయభ్రాంతులకు గురి చేయడం అమానుషం” అంటూ పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధులు, చిన్నారి తండ్రి అడ్రియన్ అలెగ్జాండర్ కోనెజో అరియాస్ ఈక్వెడార్ జాతీయుడని, చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న కారణంగా అతడిని అదుపులోకి తీసుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహించామని తెలిపారు. అయితే, ఈ చర్యలో చిన్నారిని కూడా నిర్బంధించడం సరైనదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ ఘటనను అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తీవ్రంగా ఖండించారు. చిన్నారుల హక్కులు, మానవీయ విలువలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని ఆమె స్పష్టం చేశారు. ఈ ఘటనపై మరింత విచారణ జరపాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:రిటైర్ అయినా వదలం..అధికారులకు హరీష్ హెచ్చరిక

