శివగామి పాత్ర కోసం అందాల సుందరి శ్రీదేవిని కలిస్తే ఆమె లేనిపోని డిమాండ్లు పెట్టిన విషయాన్ని మీడియాతో చెప్పకుండా ఉండాల్సిందని దర్శకుడు రాజమౌళి అన్నారు. బాహుబలి సినిమాలో శ్రీదేవి శివగామి పాత్రను తిరస్కరించడానికి కారణాలేంటని ఈ మధ్య సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జోరుగానే జరిగాయి. అయితే శివగామి పాత్రకోసం తమ టీమ్ శ్రీదేవిని అప్రోచ్ అయినప్పుడు ఆమె అనుచిత డిమాండ్లు పెట్టిందని ఇటీవలే జక్కన్న చేసిన ఆరోపణలపై అతిలోక సుందరి తీవ్రంగా స్పందించిన సంగతి తెలిసిందే. పారితోషకాన్ని భారీగా డిమాండ్ చేయడం వల్లనే బాహుబలి యూనిట్ తనను వదులుకుందని జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తప్పుపట్టింది. తను ఎనిమది కోట్ల రూపాయల పారితోషకం అడిగానన్న వార్తలను శ్రీదేవి ఖండించింది.
బాహుబలే కాదు..ఎన్నో హిట్ సినిమాలను నా వ్యక్తిగత కారణాలవల్ల తిరస్కరించాను. అయితే ఆ సినిమాల ఫిల్మ్ మేకర్స్ ఎవరూ ఇలా మాట్లాడలేదని ఆమె తెలిపింది. దీనిపై జక్కన్న పశ్చాత్తాపం వ్యక్తం చేశారు..
దీనిపై రాజమౌళి స్పందిస్తూ – `నిజమే… నేను అందరిముందు అలా మాట్లాడి ఉండకూడదు. ఈ తప్పు చేసినందుకు పశ్చాత్తాపం చెందుతున్నాను. శ్రీదేవి అంటే నాకు చాలా గౌరవం. దక్షిణాది నుంచి వెళ్లి ముంబైలో కొన్ని సంవత్సరాలుగా మన ఖ్యాతిని నిలుపుతున్నారు. ఆమె `మామ్` సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను` అని శ్రీదేవి కామెంట్లకి జక్కన్న ఈ విధంగా రియాక్ట్ అయ్యారు.