2026 టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌కు ఇక దాదాపు తలుపులు మూసుకుపోయినట్లే. తమ మ్యాచ్‌లను భారత్ నుంచి మరో దేశానికి తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డిమాండ్ వారికి ప్రతికూలంగా మారింది. చివరి క్షణంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మద్దతు తెలపడం కూడా, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) బోర్డు ముందు ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది.
ఈ అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ఐసీసీ బోర్డు బుధవారం (జనవరి 21) అత్యవసర సమావేశం నిర్వహించింది. వర్చువల్‌గా జరిగిన ఈ సమావేశంలో 16 మంది సభ్యుల్లో కేవలం ఇద్దరే బంగ్లాదేశ్ అభ్యర్థనకు అనుకూలంగా ఓటు వేశారు. ఆ ఇద్దరూ ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు – పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్.
సమావేశం అనంతరం ఐసీసీ బోర్డు బంగ్లాదేశ్‌కు తుది గడువు విధించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ప్రపంచకప్ కోసం భారత్‌కు రావాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవడానికి బీసీబీకి 24 గంటల సమయం మాత్రమే ఇచ్చింది. ఆలోపులో బంగ్లాదేశ్ అంగీకరించకపోతే, వారి స్థానంలో మరో దేశాన్ని టోర్నమెంట్లో చేర్చనున్నట్లు ఐసీసీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్ తప్పుకుంటే గ్రూప్–సీలో స్కాట్లాండ్ను చేర్చే అవకాశం ఉందని సమాచారం.
భారత్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు, అభిమానులు, మీడియా ప్రతినిధులు, అధికారులు ఎవరికీ భద్రతాపరమైన ప్రమాదం లేదని వివిధ భద్రతా అంచనాలు – స్వతంత్ర నివేదికలతో సహా – ఐసీసీ సమీక్షించింది. అందువల్ల మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాల్సిన అవసరం లేదని ఐసీసీ తేల్చింది.
Also read:‘స్వయంభూ’..విడుదల తేదీ వాయిదా!

