భారత్, పాకిస్థాన్ మధ్య అణ్వాయుధ యుద్ధాన్ని తాను అడ్డుకున్నానని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య సమరం తప్పించడంతో కోట్లాది మంది ప్రాణాలు కాపాడినట్లయిందని ఆయన అన్నారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తైన సందర్భంగా వైట్‌హౌజ్‌లో మంగళవారం మీడియాతో ట్రంప్ సుదీర్ఘంగా మాట్లాడారు. గత ఏడాది కాలంలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను ఆయన వివరించారు.
ఒక దశలో భారత్, పాక్ అణుదాడికి సిద్ధమైన పరిస్థితి ఏర్పడిందని, తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఎనిమిది యుద్ధ విమానాలు కూలిపోయాయని ట్రంప్ తెలిపారు. ఇండియా–పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడం ద్వారా సుమారు 20 మిలియన్ల మంది ప్రాణాలు కాపాడినట్లు అవుతుందని ఆయన అంచనా వేశారు. గత 10 నెలల్లోనే 8 యుద్ధాలను ఆపినట్లు ట్రంప్ పేర్కొన్నారు. కంబోడియా–థాయ్‌లాండ్, కొసోవో–సెర్బియా, కాంగో–రువాండా వంటి వివాదాలను కూడా పరిష్కరించినట్లు చెప్పారు.
వైట్‌హౌజ్ ప్రెస్ బ్రీఫింగ్ రూమ్‌లో సుమారు 105 నిమిషాలు ట్రంప్ మీడియాతో ముచ్చటించారు. ఇండో–పాక్ యుద్ధాన్ని ఆపిన విషయాన్ని ఆయన పదే పదే ప్రస్తావించారు. ఈ ఘనతలపై వైట్‌హౌజ్ ఓ ప్రకటన విడుదల చేస్తూ, “365 రోజుల్లో 365 విజయాలు” అనే పుస్తకాన్ని కూడా ఆవిష్కరించింది.
అయితే ట్రంప్ వ్యాఖ్యలను భారత్ ఖండిస్తూ, పాక్‌తో జరిగిన వివాదంలో మూడో దేశ పాత్ర లేదని స్పష్టం చేసింది. నోబెల్ శాంతి బహుమతి విషయంలోనూ ట్రంప్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

