Farmers Suicide:రేవంత్ సర్కారుపై కేటీఆర్ ఫైర్

4
- Advertisement -

తెలంగాణలో ఒకే రోజులో ముగ్గురు అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత ఆందోళనకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యరాష్ట్రం నాటి సంక్షోభ పరిస్థితులు మళ్లీ తెలంగాణవ్యాప్తంగా నెలకొన్నాయనడానికి వేర్వేరు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలే నిదర్శనమని ఆయన అన్నారు. ఆదిలాబాద్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రైతులు ప్రాణాలు కోల్పోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోందని మండిపడ్డారు.

భూపాలపల్లిలో కోడెల సదానందం, మెదక్‌లో దేవ్ సోత్ సర్వేశ్, ఆదిలాబాద్‌లో జాదవ్ అంకుష్ కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణం అప్పులేనని, రేవంత్ సర్కారు మోసపూరిత హామీలు, అమలుకాని రుణమాఫీ, పెట్టుబడి సాయం నిర్లక్ష్యం రైతులను దుస్థితిలోకి నెట్టాయని ఆరోపించారు.

రుణమాఫీ పేరిట నయవంచన చేయడమే కాకుండా, పెట్టుబడి సాయాన్ని పాతరేయడం, యూరియా సరఫరాలో విఫలం కావడం వల్ల దిగుబడులు దెబ్బతిన్నాయని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అన్నదాత పరిస్థితి అనాథ స్థితికి చేరిందన్నారు. కేవలం రెండేళ్లలోనే దాదాపు 900 మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడినా ప్రభుత్వానికి సోయి రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:‘నారీ నారీ నడుమ మురారి’..ఆనందాన్ని ఇచ్చింది

పదేళ్లు ధైర్యంగా జీవించిన రైతు కుటుంబాల్లో నేడు వినిపిస్తున్న ఈ మరణమృదంగానికి రేవంత్ సర్కారు భారీ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. అన్నదాతలు ధైర్యం కోల్పోవద్దని, మరో మూడేళ్లు ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ వ్యతిరేక కాంగ్రెస్ పాలనను గద్దెదించి, తెలంగాణలో వ్యవసాయ రంగానికి మళ్లీ మంచి రోజులు తీసుకువస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.

- Advertisement -