ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి విలయతాండవం

5
- Advertisement -

ఆఫ్రికా దక్షిణ ప్రాంత దేశాల్లో ప్రకృతి విపత్తు విలయతాండవం చేస్తోంది. మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం పూర్తిగా అతలాకుతలమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు, వరదలతో నదులు పొంగిపొర్లి అనేక గ్రామాలు నీటమునిగాయి.

ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ భారీ వర్షాల కారణంగా వెయ్యికి పైగా ఇళ్లు పూర్తిగా వరద నీటిలో కొట్టుకుపోయాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రహదారులు, వంతెనలు దెబ్బతినడంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరా, తాగునీటి సరఫరా కూడా అనేక చోట్ల పూర్తిగా అంతరాయం ఏర్పడింది.

ఇప్పటివరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు ఆయా దేశాల అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంకా పలువురు గల్లంతైనట్లు సమాచారం ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయక బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ, ఆహారం, తాగునీరు, ఔషధాలు అందిస్తున్నారు.

వాతావరణ శాఖలు మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు సూచించాయి. ఈ ప్రకృతి విపత్తు దక్షిణ ఆఫ్రికా దేశాలకు భారీ నష్టం కలిగించిందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read:టీమిండియా జట్టు కూర్పుపై కైఫ్!

- Advertisement -