ఒడిశా రాష్ట్రంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. శుక్రవారం గంజాం జిల్లాలోని 20కి పైగా ప్రాంతాల్లో ఒకేసారి ఈ దాడులు చేపట్టారు. ఇసుక, నల్లరాయి వంటి చిన్న ఖనిజాల అక్రమ తవ్వకాలు, వాటి ద్వారా జరిగిన మనీలాండరింగ్‌పై దర్యాప్తులో భాగంగానే ఈ సోదాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు.
ఈడీ భువనేశ్వర్ జోనల్ ఆఫీస్‌కు చెందిన బృందాలు PMLA–2002 (మనీలాండరింగ్ నిరోధక చట్టం) కింద ఈ తనిఖీలు నిర్వహించాయి. సోదాల సమయంలో పలు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. ముఖ్యంగా ఓ ఇంట్లోని అల్మారాలో రూ.2 కోట్లకు పైగా నగదు బయటపడటం సంచలనంగా మారింది. అంతేకాకుండా అక్రమ మైనింగ్‌కు సంబంధించిన కీలక పత్రాలు, మైనింగ్ లీజులు, లావాదేవీల వివరాలు, బ్యాంకు రికార్డులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
ప్రాథమిక విచారణలో అక్రమ ఖనిజ తవ్వకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వివిధ మార్గాల్లో దాచిపెట్టినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ నగదు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఏ విధంగా మనీలాండరింగ్ జరిగింది అనే అంశాలపై లోతైన విచారణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో మరిన్ని అరెస్టులు, ఆస్తుల జప్తు జరిగే అవకాశం ఉందని వర్గాలు చెబుతున్నాయి. ఒడిశాలో అక్రమ మైనింగ్ మాఫియాపై ఈడీ చర్యలు మరింత కఠినంగా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.
Also Read:పొట్ట చుట్టు..కొవ్వు ఎందుకు పెరుగుతుంది?

