కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ వారసుడిగా సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన హీరో. తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు ఈ స్టార్ హీరో. శాండల్‌వుడ్ సినీ ప్రముఖుల కథనం ప్రకారం కన్నడ నాట శివరాజ్‌కుమార్ కాల్‌షీట్‌లు పదేళ్ళ వరకు ముందస్తుగా బుక్ అయ్యాయి. దేశ సినీచరిత్రలోనే ఇదొక అరుదైన రికార్డు అని సినీవర్గాలు అంటున్నాయి.
తెలుగులో తొలిసారిగా నట సింహ నందమూరి బాలకృష్ణ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న 100వ చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణిలో అతిథి పాత్రలో నటించిన శివ రాజ్ కుమార్ ప్రేక్షకులను అలరించాడు. తండ్రి రాజ్ కుమార్ తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న ఈ కంఠీరవ తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదని స్పష్టం చేశారు.
కన్నడనాట బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగిన ఈ హీరో రాజకీయాల్లోకి రానున్నట్టుగా కొన్నిరోజులుగా ఊహాగానాలు జోరందుకున్నాయి. ఆ వార్తలకు చెక్ పెడుతు తనకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తెలిపారు.
ఇటీవలే రాజ్ కుమార్ సతీమణి, శివన్న తల్లి పార్వతమ్మ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో శివరాజ్ ను పరామర్శించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహులు గాంధీ వచ్చారు. శివన్నతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమంటూ ఉహాగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన శివరాజ్ తాను రాజకీయాల్లోకి రావడం లేదని తెలిపారు. రాహుల్ కేవలం పరామర్శకే వచ్చారని, ఈ భేటీలో రాజకీయాలు లేవని అన్నారు. దీంతో శివరాజ్ కుమార్ రాజకీయ ప్రవేశం గురించి చెలరేగిన ఊహాగానాలు ఉత్తుత్తివే అని తేలిపోయింది.