బంగ్లాదేశ్ క్రికెటర్లు తమ బీపీఎల్ (బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్) బహిష్కరణను ఉపసంహరించుకున్నారు. ఆటగాళ్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీసీబీ (బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు) డైరెక్టర్ నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ నుంచి తొలగించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్యమైనప్పటికీ బీపీఎల్ జనవరి 16 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది.
జనవరి 15 రాత్రి బీసీబీ మరియు సీడబ్ల్యూఏబీ (బంగ్లాదేశ్ క్రికెటర్ల సంక్షేమ సంఘం) మధ్య జరిగిన సమావేశంలో సమస్య పరిష్కారమైంది. ఈ సమావేశం అనంతరం క్రికెటర్లు తమ బహిష్కరణను ఉపసంహరించుకున్నారని తెలుస్తోంది. దీంతో బీపీఎల్ టోర్నీ తిరిగి కొనసాగేందుకు మార్గం సుగమమైంది.
భారత్–బంగ్లాదేశ్ మధ్య కొనసాగుతున్న వివాదంపై వ్యాఖ్యలు చేసినందుకు, అలాగే తమ మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్బాల్‌ను ‘భారతీయ ఏజెంట్’గా పేర్కొన్నందుకు నజ్ముల్ ఇస్లాం రాజీనామా చేయాలని ఆటగాళ్లు డిమాండ్ చేశారు. అంతేకాదు, టీ20 ప్రపంచకప్ ఆడకపోయినా జట్టుకు ఎలాంటి ఆర్థిక నష్టం ఉండదని, భారత్‌కు వెళ్లకపోతే ఆటగాళ్లకే నష్టమని, దానికి ఎలాంటి పరిహారం ఉండదని నజ్ముల్ వ్యాఖ్యానించారు.
ఆటగాళ్ల డిమాండ్లకు స్పందించిన బీసీబీ, సంస్థ ప్రయోజనాల దృష్ట్యా నజ్ముల్ ఇస్లాంను ఫైనాన్స్ కమిటీ నుంచి తొలగించినట్లు ప్రకటించింది. “క్రికెట్ యొక్క విస్తృత ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని శుక్రవారం మేము మళ్లీ ఆడతాం. బీసీబీ మా డిమాండ్లు త్వరలోనే నెరవేర్చుతామని హామీ ఇచ్చింది,” అని సీడబ్ల్యూఏబీ అధ్యక్షుడు మహ్మద్ మిథున్ మీడియా సమావేశంలో తెలిపారు.
అయితే నజ్ముల్ ఇస్లాంను తొలగించడాన్ని స్వాగతించిన ఆటగాళ్లు, ఆయన చేసిన వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ కూడా కోరుతున్నారు. ఈ నేపథ్యంలో బీసీబీ డైరెక్టర్ ఇఫ్తేఖార్ మాట్లాడుతూ, నజ్ముల్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశామని, 48 గంటల్లో స్పందించాలని ఆదేశించినట్లు తెలిపారు. “మా రాజ్యాంగ ప్రకారం చర్యలు తీసుకుంటున్నాం. శనివారం మధ్యాహ్నం వరకు ఆయన సమాధానం ఇవ్వాలి. ఆ తర్వాత విషయం క్రమశిక్షణ కమిటీకి వెళ్తుంది,” అని ఆయన వెల్లడించారు.

