మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. సంక్రాంతి కానుకగా ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. చిరు సరసన నయన్ హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ ప్రత్యేక అతిథి పాత్రలో కనిపించడం విశేషం.
కథ:
టైటిల్ సూచించినట్టే, ఈ సినిమా కథ మొత్తం ఎన్‌ఎస్‌జీ అధికారి శంకర వరప్రసాద్ (చిరంజీవి) చుట్టూ తిరుగుతుంది. ఆయనకు ధనవంతురాలైన శశిరేఖ (నయనతార)తో వివాహం జరుగుతుంది. కొన్ని అపోహల కారణంగా వారి మధ్య విభేదాలు తలెత్తి, శశిరేఖ శంకర వరప్రసాద్‌కు విడాకులు ఇస్తుంది. ఆ తర్వాత తన విరిగిపోయిన వైవాహిక జీవితాన్ని శంకర వరప్రసాద్ ఎలా సరిచేసుకుంటాడన్నదే మన శంకర వరప్రసాద్ గారు కథ.
ప్లస్ పాయింట్స్:
సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ కథ, చిరు నటన. చాలా రోజుల తర్వాత చిరు కొత్త లుక్‌లో కనిపించి మెప్పించారు. చిరు ఎనర్జీ లెవల్స్ అద్భుతం. స్టైల్, చార్మ్ అన్నీ అదిరిపోయాయి. విడాకుల అంశాన్ని చిరు ప్రస్తావించే సన్నివేశాలు బాగా కుదిరాయి. ఫస్ట్ హాఫ్ ఎక్కువగా ఎంటర్టైనింగ్‌గా సాగుతుంది. నయనతార తన పాత్రకు వందశాతం న్యాయం చేశారు. ముఖ్యంగా చిరు-నయన్ కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. వెంకటేష్ ట్రాక్ చిన్నదే అయినా వినోదాన్ని పంచుతుంది. చిరు–వెంకీ ఒకరి పాటలకు మరొకరు డాన్స్ చేయడం అభిమానులకు పండుగలాంటిది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమా కూడా పూర్తిగా ప్రేక్షకులను నవ్వించాలనే ఉద్దేశంతో తీసినదే. కొత్తదనం ఆశించే వారికి కథ కొంత నిరాశ కలిగించవచ్చు.
సాంకేతిక అంశాలు:
సాంకేతికంగా సినిమా సూపర్బ్. భీమ్స్ సిసిరోలియో సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ (సమీర్ రెడ్డి) ఓకే. ఎడిటింగ్ మిశ్రమ ఫలితం. చిరంజీవి లుక్స్, స్టైలింగ్ అద్భుతం. అనిల్ రావిపూడి మరోసారి తన మార్క్ ఎంటర్టైన్‌మెంట్‌ను అందించారు. అయితే కొన్ని ఓవర్-ది-టాప్ సన్నివేశాలు కొంచెం తగ్గించి ఉంటే బాగుండేది.
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!
తీర్పు:
మన శంకర వరప్రసాద్ గారు ఒక సరదా ఫ్యామిలీ డ్రామా. ఫస్ట్ హాఫ్ బలంగా ఉండటం, నయనతార–వెంకటేష్ పాత్రలు, మంచి పాటలు ప్లస్ పాయింట్స్. సెకండ్ హాఫ్‌లో వేగం తగ్గినా, పండుగ సమయంలో కుటుంబంతో కలిసి చూసేందుకు సరైన సినిమా.
రేటింగ్: 3.25/5
విడుదల తేదీ: జనవరి 12, 2026
నటీనటులు: చిరంజీవి, వెంకటేష్, నయనతార
నిర్మాతలు: సాహు గరపాటి, సుస్మిత కొణిదెల
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
దర్శకుడు: అనిల్ రావిపూడి

