ఇటీవల అమెరికా వెనిజువెలాపై భారీ స్థాయి ఆపరేషన్ నిర్వహించింది. ఈ దాడిలో వెనిజువెలా అధ్యక్షుడు నికోలస్ మడూరోను అదుపులోకి తీసుకుని, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌తో కలిసి న్యూయార్క్‌కు తరలించారు. అక్కడ నార్కో-టెర్రరిజం కుట్ర కేసుల్లో వారిపై అధికారికంగా అభియోగాలు నమోదు చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ‘ట్రూత్ సోషల్’లో తనను తాను “వెనిజువెలా కార్యనిర్వాహక అధ్యక్షుడు” గా పేర్కొంటూ ఒక చిత్రాన్ని షేర్ చేశారు. జనవరి 2026 నాటికి వెనిజువెలా ప్రస్తుత అధ్యక్షుడిగా ట్రంప్‌ను చూపించేలా డిజిటల్‌గా సవరించిన వికీపీడియా పేజీ చిత్రాన్ని ఆయన పోస్టు చేశారు.
ఆ చిత్రంలో ట్రంప్ అధికారిక ఫోటోతో పాటు “Acting President of Venezuela, Incumbent January 2026” అనే క్యాప్షన్ ఉంది. అలాగే ఆయనను అమెరికా 45వ మరియు 47వ అధ్యక్షుడిగా పేర్కొంటూ, 2025 జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినట్లు కూడా చూపించారు.
ఈ నెల ప్రారంభంలోనే అమెరికా వెనిజువెలాపై కీలక చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. అధ్యక్షుడు మడూరోను అరెస్ట్ చేసి, నార్కో-టెర్రరిజంతో సంబంధం ఉన్న కుట్ర కేసుల్లో న్యూయార్క్‌లో అభియోగాలు మోపింది. వెనిజువెలాలో “సురక్షితమైన, సముచితమైన, న్యాయమైన మార్పు” జరిగే వరకు అమెరికానే ఆ దేశాన్ని నిర్వహిస్తుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. వెనిజువెలా ప్రజల శ్రేయస్సు కోరని వ్యక్తుల చేతుల్లో అధికారాన్ని అప్పగించే ప్రమాదాన్ని అమెరికా తీసుకోలేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా, వెనిజువెలా ఉపాధ్యక్షురాలు మరియు చమురు శాఖ మంత్రి డెల్సీ రోడ్రిగ్స్ గత వారం దేశానికి తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు.తాత్కాలిక ప్రభుత్వం 3 కోట్ల నుంచి 5 కోట్ల బ్యారెళ్ల వరకు ఉన్న “అత్యుత్తమ నాణ్యత గల, ఆంక్షలలో ఉన్న చమురు”ను అమెరికాకు అప్పగించనున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ఆ చమురు మార్కెట్ ధరకు అమ్మి వచ్చే నిధులను వెనిజువెలా ప్రజలు మరియు అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని తెలిపారు.ఆ డబ్బు మొత్తం అమెరికా అధ్యక్షుడిగా నా నియంత్రణలోనే ఉంటుంది. ఈ ప్రణాళికను వెంటనే అమలు చేయాలని ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్‌ను ఆదేశించాను. చమురును నిల్వ నౌకల ద్వారా నేరుగా అమెరికాలోని దిగుమతి నౌకాశ్రయాలకు తరలిస్తాం అని ట్రంప్ తెలిపారు.
Also Read:లైంగిక దాడి..కాంగ్రెస్ బహిష్కృత ఎమ్మెల్యే అరెస్ట్!

