అదిలాబాద్ జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు దిగింది. జిల్లాలో రంగు మారిన సోయా పంట కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయంటూ మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు పిలుపునిచ్చారు. రైతుల ఆవేదనకు స్పందించాల్సిన ప్రభుత్వాలు సమస్యను గాలికొదిలేశాయని ఆయన విమర్శించారు.
ఇవాళ ధర్నా, బందుకు అఖిలపక్షం రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. రైతుల సమస్యలు రాజకీయాలకు అతీతమని, సోయా రైతులకు తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. పట్టణ బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్‌లో దుకాణాలు, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి.
ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్ డిపో ముందు ధర్నా నిర్వహిస్తున్న మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేసి మావల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.రైతులకు న్యాయమైన మద్దతు ధర కల్పించేవరకు, రంగు మారిన సోయా పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం ఆగదని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. రైతాంగం హక్కుల కోసం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read:2026 ఫిబ్రవరి..చాలా స్పెషల్-జీవితంలో ఒకసారే!

