అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురికావడం తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. నిఖిత గోడిశాల అనే యువతిని ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు అర్జున్ శర్మ భారత్‌కు తిరిగి వచ్చాడని సమాచారం. ఈ ఘటన డిసెంబర్ 31న చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
డిసెంబర్ 31న నిఖిత, అర్జున్ శర్మ అపార్ట్‌మెంట్‌కు వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. అదే రోజు ఆమెను కత్తితో పొడిచి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరింత దారుణమైన విషయం ఏమిటంటే, నిఖిత మృతదేహం తన ఫ్లాట్‌లోనే ఉండగానే అర్జున్ శర్మ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన ఈ వ్యవహారం కేసును మరింత కీలకంగా మార్చింది.
ఘటన వెలుగులోకి రావడంతో అర్జున్ శర్మపై అమెరికా పోలీసులు అరెస్ట్ వారంట్ జారీ చేశారు. అతడిని తిరిగి అమెరికాకు తీసుకువచ్చే ప్రక్రియపై న్యాయపరమైన చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం. నిఖిత కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవగా, న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. మృతురాలి కుటుంబంతో నిరంతరం టచ్‌లో ఉన్నామని, అన్ని విధాలా సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఇండియన్ ఎంబసీ స్పష్టం చేసింది.
Also Read:చంద్ర గ్రహణం..శ్రీవారి ఆలయం మూత

