న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా భారీ సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. మొత్తం 2,731 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పోలీసుల తనిఖీల్లో చిక్కుకున్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అత్యధికంగా 1,198 మంది డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 928 మంది, మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో 605 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు తెలిపారు. నగరంలోని ప్రధాన రహదారులు, జంక్షన్లు, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో రాత్రి పొడవునా ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి.
పట్టుబడిన వారందరిపై చట్టప్రకారం కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొందరిని కోర్టులకు హాజరు పరచగా, మరికొందరికి జరిమానాలు విధించే ప్రక్రియ చేపట్టినట్లు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రజలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాలని సూచించారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.
Also Read:జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు

