బెంగళూరులో మరోసారి “లక్కీ భాస్కర్” సినిమా కథను తలపించే బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగుళూరులోని మల్లేశ్వరం 13వ క్రాస్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకు శాఖలో పనిచేస్తున్న మేనేజర్ ఖాతాదారులను నమ్మించి భారీగా మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. బ్యాంకు మేనేజర్ రఘు దాదాపు 41 మంది ఖాతాదారుల నుంచి ఖాళీ చెక్కులు, ఓటీపీలు సేకరించి వారి ఖాతాలను దుర్వినియోగం చేశాడు.
ఖాతాదారులు బ్యాంకులో భద్రతగా ఉంచిన బంగారాన్ని కుదవ పెట్టి, వారి అనుమతి లేకుండా రుణాలు తీసుకున్నట్టు విచారణలో తేలింది. ఈ విధంగా సుమారు రూ.3.11 కోట్ల మేర బంగారు రుణాలను అక్రమంగా తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఖాతాదారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఈ లావాదేవీలు జరగడంతో చాలాకాలం పాటు మోసం బయటపడలేదు.
ఇటీవల బ్యాంకు ఉన్నతాధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీలో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. రుణాల పత్రాలు, ఓటీపీ వినియోగం, ఖాతా లావాదేవీల్లో అసాధారణతలు గుర్తించడంతో మేనేజర్ రఘుపై అనుమానం బలపడింది. విచారణ చేపట్టిన అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.
ఈ ఘటన బ్యాంకింగ్ వ్యవస్థలో భద్రత, పర్యవేక్షణపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. మోసపోయిన ఖాతాదారులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుండగా, బ్యాంకు యాజమాన్యం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది.
Also Read:న్యూజిలాండ్‌తో సిరీస్..బుమ్రా,హార్దిక్‌కు విశ్రాంతి!

