హైదరాబాద్‌లో జర్నలిస్టుల అరెస్టులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఏడవ గ్యారంటీ ఇదేనా? అంటూ ఆయన తీవ్రంగా ప్రశ్నించారు. ప్రజల గొంతుకగా నిలిచే జర్నలిస్టులను అరెస్టు చేయడం, నిర్బంధించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని కేటీఆర్ ఆరోపించారు.
జర్నలిస్టుల ఆకాంక్షలకు పూర్తిగా వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్వేచ్ఛాయుత మీడియా లేకుండా ప్రజాస్వామ్యం నిలబడదని, మీడియాను అణచివేసే ప్రయత్నాలు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని కేటీఆర్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళన చేస్తున్న పలువురు జర్నలిస్టులను అరెస్టు చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటన జర్నలిస్టులలో ఆందోళనను రేకెత్తించింది.
అరెస్టుల అనంతరం ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం విస్మరిస్తోందని, అక్రిడిటేషన్ విషయంలో తీసుకున్న నిర్ణయాలు మీడియా స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన విమర్శించారు. జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
Also Read:కొత్తిమీరతో ప్రయోజనాలు..!

