ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ 2025లో ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ప్రభావవంతమైన బౌలర్‌గా నిలుస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటివరకు 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో 51 వికెట్లు తీసి, 17.15 సగటుతో టెస్టుల్లో అగ్ర వికెట్ టేకర్‌గా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 3–0తో తిరుగులేని ఆధిక్యం సాధించడంలో స్టార్క్ ప్రదర్శన కీలక పాత్ర పోషించింది.
ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో స్టార్క్ 17.04 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. వేగం, స్వింగ్, కచ్చితమైన లైన్–లెంగ్త్‌తో ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌ను నిరంతరం ఇబ్బంది పెట్టాడు. స్టార్క్ ప్రదర్శనపై మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్ ఐసీసీ రివ్యూ పోడ్కాస్ట్‌లో మాట్లాడుతూ అతడిపై ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇంతకంటే మెరుగ్గా అతడు బౌలింగ్ చేయడం నేను చూడలేదు. కొత్త బంతితో అతడు చేస్తున్న ప్రదర్శన అసాధారణం. ఎప్పటినుంచో అతడు కొత్త బంతితో, అలాగే పాత బంతి రివర్స్ స్వింగ్‌తో మంచి బౌలర్‌గా పేరు పొందాడు. కానీ ఇప్పుడు తన ఆటలో కొత్త కోణాలను, కొత్త నైపుణ్యాలను జోడించి మరింత సంపూర్ణ బౌలర్‌గా మారాడు అని పాంటింగ్ అన్నారు.
తన సంప్రదాయ బలాలకు తోడుగా కొత్త బౌలింగ్ ఆయుధాలను చేర్చుకున్నాడని పాంటింగ్ వివరించారు. రైట్‌హ్యాండర్లకు ఎదురుగా వొబుల్ సీమ్ డెలివరీని సమర్థంగా ఉపయోగించడం వల్ల అతడికి మరింత నియంత్రణ, స్థిరత్వం వచ్చిందన్నారు. ఇక అతడి ప్రధాన ఆయుధంగా ఇప్పటికీ ఫుల్ లెంగ్త్ ఇన్‌స్వింగర్ కొనసాగుతుందని తెలిపారు.
Also Read:ఓటీటీలోకి ‘ఆంధ్ర కింగ్ తాలూకా’
ఇప్పుడు అతడు రైట్‌హ్యాండర్లకు ఎదురుగా పెద్ద ఇన్‌స్వింగర్‌పైనే ఆధారపడటం లేదు. వొబుల్ సీమ్ బంతితో బయటికి వెళ్లే డెలివరీని ఎప్పుడైనా వేయగలడు. దానికి కావాల్సిన లైన్, లెంగ్త్‌పై అతడికి పూర్తి అవగాహన ఉంది. అయినప్పటికీ అతడి ప్రధాన స్ట్రైక్ వెపన్ ఇప్పటికీ ఫుల్ ఇన్‌స్వింగర్‌నే అని పాంటింగ్ ముగించారు.

