ఛత్తీస్‌గఢ్‌లో వెలుగుచూసిన మద్యం కుంభకోణం కేసులో సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్‌కు రూ.200 నుంచి రూ.250 కోట్ల వరకు వాటాగా అందినట్లు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసు మొత్తం విలువ రూ.3,000 కోట్లకు మించినదిగా అంచనా వేస్తున్నారు.
సోమవారం ఛత్తీస్‌గఢ్ పోలీసుల యాంటీ కరప్షన్ బ్యూరో/ఎకనామిక్ ఆఫెన్స్ వింగ్ (ACB/EOW) ఈ ఆరోపణలు చేసింది. ఈ మద్యం స్కామ్‌కు సంబంధించి ఏడవ అదనపు ఛార్జ్‌షీట్‌ను కోర్టులో దాఖలు చేసినట్లు తెలిపింది. భూపేశ్ బఘేల్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఎక్సైజ్ శాఖలో దందా (సిండికేట్) ఏర్పాటు చేయడం, సమన్వయం చేయడం, రక్షణ కల్పించడం వంటి కార్యకలాపాల్లో చైతన్య పాత్ర ఉందని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.
“సాక్ష్యాల ప్రకారం నేరం ద్వారా వచ్చిన డబ్బును పై స్థాయిలో నిర్వహించడంతో పాటు, చైతన్య తన వాటాగా రూ.200–250 కోట్ల వరకు స్వీకరించాడు,” అని ఛార్జ్‌షీట్‌ను ఉటంకిస్తూ పీటీఐ తెలిపింది.ACB/EOW ప్రకటన ప్రకారం, సుమారు 3,800 పేజీలతో కూడిన విస్తృతమైన ఛార్జ్‌షీట్‌లో చైతన్య బఘేల్‌ను నిందితుడిగా పేర్కొన్నారు. ఇప్పటివరకు ఈ కేసులో మొత్తం ఎనిమిది ఛార్జ్‌షీట్లు దాఖలయ్యాయి.
వ్యాపారవేత్త అన్వర్ ధేబర్ బృందం నిర్వహించిన ఈ మద్యం దందా ద్వారా వచ్చిన డబ్బును చైతన్య తన నమ్మకమైన నెట్‌వర్క్ ద్వారా పై స్థాయిలకు మళ్లించాడని ఆరోపించారు. మద్యం వ్యాపారి త్రిలోక్ సింగ్ ధిల్లన్‌కు చెందిన పలు సంస్థల ద్వారా తన వాటాను స్వీకరించి, బ్యాంకింగ్ మార్గాల ద్వారా కుటుంబ సంస్థలకు మళ్లించి, రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు పెట్టినట్లు పేర్కొన్నారు. ఈ మద్యం స్కామ్‌కు సంబంధించి జూలై 18న చైతన్య బఘేల్ నివాసంలో సోదాల అనంతరం ఈడీ ఆయనను అదుపులోకి తీసుకుంది. ఈ స్కామ్ వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని, మద్యం సిండికేట్‌కు లబ్ధి చేకూరిందని కేంద్ర సంస్థ పేర్కొంది.
Also read:మాస్ అవతారంలో విజయ్..’రౌడీ జనార్ధన’

