నటుడు అడివి శేష్ తన తదుపరి చిత్రం ‘డకాయిట్’తో ప్రేక్షకులను మరోసారి అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానియల్ డియోకు దర్శకుడిగా తొలి ప్రయత్నం కావడం విశేషం. ఉగాది ప్రత్యేకంగా మార్చి 19, 2026న ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ రోజు చిత్రబృందం విడుదల చేసిన టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. అద్భుతమైన ప్రొడక్షన్ విలువలు, శక్తివంతమైన యాక్షన్ సన్నివేశాలు, వేగవంతమైన కట్స్, హైక్వాలిటీ సినిమాటోగ్రఫీ టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. కథ గురించి పెద్దగా వెల్లడించకపోయినా, ప్రేమ-ప్రతీకారాల మేళవింపుతో కూడిన డార్క్, ఎమోషనల్ కథనాన్ని సినిమా అందించబోతోందని టీజర్ స్పష్టంగా సూచిస్తోంది.
టైటిల్‌కు తగ్గట్టుగానే అదివి శేష్ దొంగ పాత్రలో కనిపించనున్నాడు. అతడు మృణాల్ ఠాకూర్‌పై ప్రేమలో పడతాడు. అయితే వారి ప్రేమకథకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. ముఖ్యంగా పోలీస్ పాత్రలో కనిపిస్తున్న అనురాగ్ కశ్యప్ శేష్‌కు పెద్ద ముప్పుగా మారుతాడు. టీజర్లో బ్యాక్‌గ్రౌండ్‌లో నాగార్జున నటించిన హలో బ్రదర్ చిత్రంలోని ప్రసిద్ధ గీతం ‘కన్నెపెట్టరో కన్ను కొట్టరో’ వినియోగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ చిత్రాన్ని సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ‘డకాయిట్’ అదే రోజున హిందీలో కూడా ఏకకాలంలో విడుదల కానుంది.
Also Read:ఛాంపియన్ మూవీ..ఆనందంగా ఉంది!

