పాలమూరు ప్రాంతంలోని నాగర్‌కర్నూల్ జిల్లాలోని ఏడు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల హడావుడి పూర్తిగా కనిపించడంలేదు. ఎన్నికల వాతావరణం ఉత్సాహంగా ఉండాల్సిన వేళ, ఈ గ్రామాల్లో మాత్రం నిశ్శబ్దం నెలకొంది. కారణం తమ సమస్యలు సంవత్సరాలుగా పరిష్కారమవ్వకపోవడంపై గ్రామస్తుల్లో పెరిగిన ఆగ్రహం. తమ గోడును పట్టించుకోని పాలకులపై నిరసనగా ఎన్నికలను బహిష్కరించాలని ఈ గ్రామాల ప్రజలు నిర్ణయం తీసుకున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండల పరిధిలోని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండా సహా మొత్తం ఏడు గ్రామాల ప్రజలు ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. డిండీ నార్లాపూర్ ఎత్తిపోతల పథకం కింద నిర్మించ తలపెట్టిన జలాశయం వల్ల తమ గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయనే భయం వారిని వెంటాడుతోంది. పథకం కారణంగా ఇళ్లు, వ్యవసాయ భూములు, జీవనాధారాలు కోల్పోతామన్న ఆందోళన గ్రామస్తుల్లో తీవ్రంగా ఉంది.
ఈ విషయమై అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా సరైన హామీలు, స్పష్టమైన పరిష్కారం రాలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పునరావాసం, పరిహారం వంటి అంశాలపై స్పష్టత ఇవ్వకపోవడంతోనే ఎన్నికల బహిష్కరణే చివరి ఆయుధంగా ఎంచుకున్నామని వారు చెబుతున్నారు. తమ భవిష్యత్తుకు భరోసా కల్పించే వరకు ఓటింగ్‌కు దూరంగా ఉంటామని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు.
Also Read:వాట్సాప్ డేటా సేకరణ..అనుమతి తప్పనిసరి!

