GHMC:డీ లిమిటెషన్ పై వాడి వేడి చర్చ

6
- Advertisement -

GHMC విస్తరణ, వార్డుల డీలిమిటేషన్ అంశాలపై జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం తీవ్ర వాగ్వాదాలతో వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడవడంతో సమావేశం హాట్‌టాపిక్‌గా మారింది. వార్డుల డీలిమిటేషన్‌ను శాస్త్రీయంగా, సమానత్వంతో చేపట్టాలని BRS, బీజేపీ, కాంగ్రెస్, MIM పార్టీల కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు.

GHMC విస్తరణ అంశంపై కౌన్సిల్‌లో ఓటింగ్ పెట్టాలని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు తీసుకోకుండా, ఏకపక్షంగా విస్తరణ నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. మరోవైపు మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం GHMCలో కలిపి తమకు తీవ్ర అన్యాయం చేశారంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల స్వరూపం ఉన్న నియోజకవర్గాన్ని నగర పాలక సంస్థలో కలపడం వల్ల ప్రజలపై అదనపు పన్నుల భారం పడుతుందన్నారు.

కొత్తగా GHMCలో కలిపిన మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ముందుగా అభివృద్ధి చేసిన తర్వాతే విస్తరణ చేయాలని పలుపార్టీలు డిమాండ్ చేశాయి. కనీస మౌలిక వసతులు — తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం కూడా సరిగా లేని ప్రాంతాలను GHMCలో కలిపి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ స్థాయిలో పన్నులు వసూలు చేయడం అన్యాయమని విమర్శించారు.

MIM పార్టీ మాట్లాడుతూ, తమ పార్టీ రాజకీయంగా బలంగా ఉన్న ప్రాంతాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే GHMC విస్తరణ చేస్తున్నారని ఆరోపించింది. బీజేపీ కౌన్సిలర్లు కూడా డీలిమిటేషన్‌లో తీవ్ర అసమానతలు ఉన్నాయని ప్రశ్నించారు. ఒకచోట 25 వేల జనాభాకు ఒక డివిజన్ ఏర్పాటు చేస్తే, మరోచోట 65 వేల మందికి ఒక డివిజన్ మాత్రమే ఉండడం ఎలా సమంజసం అని నిలదీశారు.

Also Read:KTR:కాంగ్రెస్ ఎమ్మెల్యేలది అధికార మదం

మొత్తంగా GHMC విస్తరణ, వార్డుల డీలిమిటేషన్ అంశాలు కౌన్సిల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని అన్ని పార్టీలు ప్రభుత్వాన్ని కోరాయి.

- Advertisement -