భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడు రోజుల పర్యటనలో భాగంగా రెండో రోజైన బుధవారం నాడు ఓ బాలుడిని కలిసి ఆశ్చర్యానికి గురిచేశారు. ఆ బాలుడు ఎవరో కాదు.. 2008లో ముంబయిలోజరిగిన పేలుళ్లలో తల్లిదండ్రుల్ని కోల్పోయిన బాలుడు మోషే.. ముంబయి పేలుళ్లు జరిగినపుడు ఇజ్రాయెల్‌కు చెందిన రెండేళ్ల వయసున్న బాలుడు మోషే.. అదృష్టవశాత్తూ తన ప్రాణాలు దక్కించుకున్నాడు. సాక్షాత్తూ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ తనను ఇప్పుడు చూడడానికి రావడంతో మురిసిపోయాడు. చిన్నారిని చూడగానే చేతులు చాచి ఆలింగనం చేసుకున్న మోడీకి మోషే ‘డియర్ మోడీ.. ఐ లవ్యూ’ అని చెప్పాడు.
ఆనాటి ఘటనను గుర్తు చేసుకుని ఉద్వేగానికి గురైన బాలుడిని ఆప్యాయంగా హృదయానికి హత్తుకుని తన ఆత్మీయతను చాటుకున్నారు మోడీ. ఈ సంధర్బంగా భారత్‌కు రావాల్సిందిగా.. మీరంతా వచ్చి… ముంబయిలో నివసించండని… మీరెప్పుడు కోరుకుంటే అప్పుడు రావచ్చని.. ఎక్కడికైనా వెళ్లవచ్చని.. దీర్ఘకాలిక వీసాలు ఇస్తామని మోడీ మోషేకి అదిరిపోయే బహుమతినిచ్చారు. దీంతో వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహూ కల్పించుకుని ‘మోడీ నన్ను భారత్ కు ఆహ్వానించారు. నువ్వు రావాలనుకుంటే నాతో పాటు భారత్ రావచ్చు’ అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.
ఆ బాలుడు స్పందిస్తూ ‘ఆప్కా స్వాగత్ హై హమారా దేశ్ మే’ అని హిందీలో మోడీని స్వాగతించాడు. తనపై ఎప్పటికీ ప్రేమను కొనసాగించాలని కోరాడు. ‘నేనిప్పుడు అఫులాలో నివసిస్తున్నా. ఛాబాద్ (నారీమన్) హౌస్‌తో నా అనుబంధాన్ని గుర్తుపెట్టుకుంటా. నేను పెద్దయ్యాక ముంబయి వస్తా. అక్కడ నివాసం ఉంటా. ఛాబాద్ హౌస్‌కి డైరెక్టర్ని అవుతా. మోడీజీ..! మిమ్మల్ని, భారత ప్రజల్ని నేను ప్రేమిస్తుంటా’నని చెప్పాడు. కాగా, ముంబైలోని నారిమన్ హౌస్ లో తల్లిదండ్రులను కోల్పోయేనాటికి మోషే రెండేళ్ల చిన్నారి. నాటి పాక్ ముష్కరుల మారణకాండ నుంచి ఆ చిన్నారిని వాళ్లింట్లో పనిచేసే భారత్ కు చెందిన శాండ్రా శామ్యూల్ అనే ఆయా కాపాడింది.