నల్గొండ జిల్లా అనుముల మండలం పేరూరు గ్రామంలో చోటుచేసుకున్న సర్పంచ్ రిజర్వేషన్ వివాదం ప్రస్తుతం విస్తృత చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం సర్పంచ్ స్థానాన్ని ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసింది. అయితే గ్రామంలో ఒక్క ఎస్టీ మహిళ కూడా లేనని వాస్తవ పరిస్థితులు తెలియడంతో, సర్పంచ్ పదవికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో రిజర్వేషన్ కేటాయింపులో ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేరూరు గ్రామంలో మొత్తం ఎనిమిది వార్డులు ఉండగా, అందులో నాలుగు వార్డులను ఎస్టీ కేటగిరీకి కేటాయించడం మరింత అసంతృప్తికి దారితీసింది. గ్రామ జనాభా నిర్మాణం, కులవివరాలు సరిగ్గా పరిగణించకుండా రిజర్వేషన్ నిర్ణయం తీసుకోవడంతో, ప్రజల జీవనాధారమైన గ్రామ పరిపాలన ఎన్నికలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.
ఈ పరిణామంతో గ్రామ రాజకీయ నేతలు, వివిధ పార్టీల ప్రతినిధులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామ ప్రజల అభిప్రాయాలు, వాస్తవ డేటా, కుల వివరాలను పరిగణలోకి తీసుకోకుండా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడం వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు నష్టం జరుగుతుందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సరైన కుల గణన లేకుండా రిజర్వేషన్లు కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని స్థానిక నేతలు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని వెంటనే సరిదిద్దాలని, గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
Also Read:పోలీస్ కమిషనరేట్ వెబ్సైట్ హ్యాక్!

