తెలంగాణ పంచాయతీ ఎన్నికల వేళ గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీల పోటీ పడ్డారు. ఇంటింటికి 5 లక్షల బీమా నుండి పెళ్లి ఖర్చులకు సాయం, ఉచిత అంబులెన్స్ సేవల వరకు ఎన్నో ఆశాజనకమైన వాగ్దానాలు చేస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి పనుల వనమ్మ నరసింహ యాదవ్ తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి రూ.5 లక్షల జీవిత బీమా చేయిస్తానని ప్రకటించాడు. గ్రామంలో 700 ఇండ్లు ఉండగా, ఒక్కింటికి సంవత్సరానికి రూ.1200 ప్రీమియం కడితే మొత్తం సంవత్సరానికి రూ.8.40 లక్షలు, ఐదేళ్లకు రూ.42.5 లక్షలు అయ్యే లెక్కను గ్రామస్తులే చెబుతున్నారు.
ఈ బీమా హామీతో పాటు తన మ్యానిఫెస్టోలో మొత్తం 15 ముఖ్య హామీలు ప్రకటించాడు. వాటిలో—
ఆడబిడ్డ పుట్టితే రూ.5,000 ఫిక్స్డ్ డిపాజిట్
ఆడపిల్ల పెళ్లికి పుస్తె మెట్టెలు, అబ్బాయి వివాహానికి రూ.5,116
ప్రతి నెలా మెడికల్ క్యాంపులు
శస్త్ర చికిత్సల కోసం రూ.15,000 సహాయం
ఇల్లు కట్టే సమయంలో స్లాబ్ వేసుకునేందుకు రూ.21,000
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులు, షూస్
ఉన్నత చదువులకు ఆర్థిక సాయం
గ్రామ గ్రంథాలయం ఏర్పాటు
ముఖ్య పండుగల సందర్భంగా అన్నదానాలు, ఇఫ్తార్ విందులు
గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు
మరణించిన కుటుంబాలకు రూ.10,000 సాయం, వైకుంఠ రథం ఏర్పాటు
గద్వాల జిల్లా గట్టు మండలం సల్కాపరం గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఆంజనేయులు తన 22 హామీలతో కూడిన మ్యానిఫెస్టోను రూ.100 బాండ్ పేపర్‌పై రాసి, వాటిని అమలు చేయలేనట్లయితే పదవి నుండి తప్పుకుంటానని నేరుగా హామీ ఇచ్చాడు.
Also Read:Bihar:స్పీకర్‌గా ప్రేమ్ కుమార్
ఇలాంటి వరాల జల్లుతో అనేక గ్రామాల్లో ప్రజలు ఒకే అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. ఆదిలాబాద్‌లో 22 మంది, నిజామాబాద్‌లో 10 మంది, కామారెడ్డిలో 5 మంది, నిర్మల్‌లో 8 మంది, ఖమ్మం మరియు జనగామలో చెరో 6 మంది, వరంగల్‌లో 5 మంది, మహబూబాబాద్‌లో 3 మంది, మహబూబ్‌నగర్‌లో 2 మంది, ములుగు–భూపాలపల్లి జిల్లాల్లో ఒక్కొక్కరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
నల్గొండ జిల్లా చిన్న ఆడిశర్లపల్లి, ములకలపల్లి గ్రామాల్లో దేవాలయం నిర్మిస్తామని హామీ ఇచ్చిన అభ్యర్థులను గ్రామస్తులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ప్రత్యేకంగా నిలిచింది.

