HILT పాలసీ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణాన్ని బయటపెట్టేందుకు బీఆర్ఎస్ పోరుబాట ప్రారంభించింది. హైదరాబాద్ పరిధిలో విలువైన పారిశ్రామిక భూములను మార్కెట్ రేటుతో పోలిస్తే అతి తక్కువ ధరలకు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ..HILTP పేరిట సుమారు 9,300 ఎకరాల భూములను రెగ్యులరైజ్ చేసి ప్రజలకు చెందాల్సిన దాదాపు రూ.5 లక్షల కోట్ల ఆస్తిని దోచుకునే ప్రయత్నం జరుగుతోంది అని తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజా ధనాన్ని దోచుకోవడానికి రూపొందించిన ఈ స్కీమ్‌ను అడ్డుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాన్ని “భూ మాఫియా కోసం ప్రత్యేక ఆఫర్”గా వ్యాఖ్యానించిన కేటీఆర్, ఈ విషయంలో ప్రజలకు పూర్తి నిజాలు తెలియజేయడానికి క్షేత్రస్థాయిలో ఉద్యమాన్ని విస్తరించనున్నట్లు ప్రకటించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా 8 నిజ నిర్ధారణ (ఫాక్ట్ ఫైండింగ్) బృందాలను బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. పారిశ్రామిక వాడలను క్లస్టర్లుగా విభజించి ప్రతి బృందం భూముల మార్కెట్ విలువ, ప్రభుత్వం ప్రకటిస్తున్న రెగ్యులరైజేషన్ రేట్లు, వాటి మధ్య ఉన్న భారీ తేడా వంటి అంశాలను పరిశీలించనుంది.
Also Read:Bihar:స్పీకర్‌గా ప్రేమ్ కుమార్
డిసెంబర్ 3, 4 తేదీల్లో ఈ బృందాలు హైదరాబాద్ పరిధి సహా పలు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించనున్నాయి. ప్రజలకు వాస్తవాలు తెలియజేయడం, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం, భూ కుంభకోణాన్ని నిలువరించడం తమ ప్రధాన లక్ష్యమని బీఆర్ఎస్ నేతలు తెలిపారు.బీఆర్ఎస్ ఈ పర్యటనల అనంతరం విస్తృత ప్రజా చర్చలు, ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

