ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ నేతలతో సమావేశమయ్యారు. కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, వెంకయ్యనాయుడుతోపాటు టీఆర్ ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సమావేశంలో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. రామ్‌నాథ్ కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకంటించగానే మద్దతిచ్చిన తొలి ఎన్డీయేతర పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అని తెలిపారు.
రామ్‌నాథ్ కోవింద్ కు పూర్తి మద్దతు ప్రకటించిం సీఎం కేసీఆర్ కు వెంకయ్య ధన్యవాదాలు తెలిపారు.
రామ్‌నాథ్ కోవింద్ ఉత్తరప్రదేశ్ లోని రైతు కుటుంబంలో పుట్టినవాడని, రాజకీయాలకు అతీతంగా రామ్‌నాథ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారన్నారు. అంతేకాకుండా రాష్ట్రపతి ఎన్నికల్లో కోవింద్ ఘనవిజయం సాధించడం ఖాయమని తెలిపారు.
కోవింద్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని, న్యాయవాదిగా సుప్రీంకోర్టులోనూ సేవలందించారని అన్నారు.
అంతేకాకుండా రామ్‌నాథ్ కోవింద్ మంచి రచయిత, వక్త అని కూడా తెలిపారు వెంకయ్య. రాష్ట్రపతి పదవికి అన్ని విధాలా అర్హులని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపాకే..కోవింద్ ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించామన్నారు. కాగా..ఎన్డీయేలో భాగస్వాములుకాని ఇతర పార్టీలు కూడా కోవింద్ కు మద్దతిచ్చాయని తెలిపారు.