రైల్వే ఉద్యోగులు ఇకపై సరికొత్త డిజైనర్ దుస్తుల్లో మెరిసిపోనున్నారు. ప్రయాణికులతో నిత్యం టచ్ లో ఉండే రైల్వే సిబ్బంది కోసం ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూ బేరి దుస్తులను డిజైన్ చేశారు. దాంతో త్వరలోనే ఉద్యోగులు రీతూ బేరి రూపొందించిన డిజైనర్ దుస్తులతో కనువిందు చేయనున్నారు.
కార్యాలయ ఉద్యోగులు, స్టేషన్ మాస్టర్లు, టీటీఈలు, గార్డులు, డ్రైవర్లు, ఆహార సరఫరా సిబ్బంది విభాగాలను బట్టి వేర్వేరు రకాల దుస్తులను అందజేయనున్నారు. వీటికి సంబంధించిన నమూనాలను రూపొందించిన రీతూ వాటిని రైల్వే శాఖ ఆమోదం కోసం పంపారు.
ఆమె రూపొందించిన డిజైన్లలో కొన్నింటికి రైల్వే శాఖ ఆమోదం తెలిపింది. వీటిని అక్టోబర్ నుంచి అమలులోకి తీసుకురానున్నారు. రీతూ రూపొందించిన జాకెట్లు, నలుపు, పసుపు రంగులో ఉండే టీ షర్టులు రైల్వే లోగోతో ఆకర్షణీయంగా ఉన్నాయని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
టీషర్టులను కార్యాలయంలో పనిచేసే ఉద్యోగుల కోసం రూపొందించారు. పసుపు, ఆకుపచ్చ రంగుతో రూపొందించిన జాకెట్లు టీటీఈలు, గార్డులు, డ్రైవర్ల కోసం, నలుపు బోర్డర్‌తో ఉన్న టీ షర్టులు క్యాటరింగ్ సిబ్బంది కోసం రూపకల్పన చేశారు.
ప్రస్తుతం సిబ్బంది ధరించే యూనిఫాం దశాబ్దాల కిందట తయారు చేసిందని, వీటిని కేవలం స్టేషన్ మాస్టర్లు, టీటీఈలకు మాత్రమే అందజేశారని రైల్వే అధికారులు తెలిపారు.
ఇక 2016-17 బడ్జెట్ సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ ఉద్యోగుల ఏకరూప దుస్తుల్లో మార్పులు తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. అలాగే వర్క్ షాప్ సిబ్బందికి కూడా కొత్త యూనిఫాం అందజేస్తామని తెలిపారు. మొత్తం సుమారు 5 లక్షల మంది సిబ్బందికి సరికొత్త యూనిఫాంను అందజేయనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.