ఎప్పుడో పదేళ్ల క్రితం వచ్చిన మగధీర తెలుగు సినిమా వసూళ్ల రికార్డును తిరగరాసింది. రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ సినిమా ఆల్ టైం రికార్డు బద్దలు కొట్టింది. ఫిక్షన్ – జానపదం – యాక్షన్ కలగలిపి తీసిన ఈ సినిమా అన్ని వర్గాలనూ విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా లీడ్ పెయిర్ రామ్ చరణ్ – కాజల్ జంట చూడముచ్చటగా కనిపించింది. ఈ సినిమా ఇప్పుడు రికార్డు బద్దలు కొట్టడమేమిటనే సందేహమా..!
అయితే ఈ రికార్డు వెండితెరపై కాదు యూట్యూబ్ లో.. సౌత్ నుంచి హిందీలోకి డబ్ అయిన మూవీస్ లో మగధీర రికార్డు సృష్టించింది. ఈ సినిమాకు ఇంతవరకు 100 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సాధారణంగా నార్త్ లో మన సినిమాలకు పెద్దగా ఆదరణ ఉండదు. కానీ అలాంటిది ఈ సినిమాకు ఈ రేంజ్ వ్యూస్ రావడం మామూలు విషయం కాదు. పై పెచ్చు ఈ సినిమాకు లక్ష నలభై రెండు వేల లైకులు కూడా లభించాయి. హిందీలోకి డబ్బింగ్ అయిన మూవీస్ లో ఇంతవరకు ఏ సినిమాకు ఇంతగా వ్యూస్ రాలేదట.
మరి తాజాగా బాహుబలి హిట్ తర్వాత నార్త్ జనాల దృష్టి సౌత్ పై బానే పడింది. బాహుబలి సినిమా తీసిన రాజమౌళి మగధీరకు సైతం దర్శకత్వం వహించాడనే పాయింట్ అక్కడి వ్యూయర్స్ ను అట్రాక్ట్ చేసింది. దీనికితోడు ఈమధ్య సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – కృతి సనన్ జంటగా నటించిన రాబ్తా మూవీ మగధీరకు అనఫీషియల్ కాపీ అన్న వివాదం ఈ సినిమాను మరోసారి లైమ్ లైట్ లోకి తెచ్చింది. మగధీరుడు మనతోపాటు హిందీ జనాలను మెప్పించడం తెలుగువారందరికీ ఆనందమే.