రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన రవితేజ సోదరుడు భరత్ అంత్యక్రియలు ఆదివారం జూబ్లిహిల్స్ మహప్రస్థానంలో జరిగాయి. భరత్ అంత్యక్రియలకు కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదు. రవితేజ మూడో సోదరుడు రఘు మాత్రమే భరత్ అంత్యక్రియలకు హాజరయ్యారు. అతడి పర్యవేక్షణలోనే భరత్ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో జరిగాయి. కొద్ది మంది మిత్రులు, పరిచయస్తులు సినీ నటులు అలీ, రఘుబాబు, నల్లమలుపు బుజ్జి, వైవీఎస్ చౌదరి, జీవితారాజశేఖర్, ఉత్తేజ్ తదితరులు పాల్గొన్నారు. కుటుంబ సభ్యులెవరూ చివరి చూపు కూడా చూడకపోవడంతో.. తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో కార్యక్రమాలు చేయించారు. ఇందుకోసం అతడికి రూ. 1500 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు సమాచారం. పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నానని అక్కడున్నవారితో ఆర్టిస్ట్ చెప్పినట్లు తెలుస్తోంది.
భరత్ మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తైన తరువాత వారి ఇంటికి తీసుకెళ్లకపోవడం చర్చనీయాంశంగా మారింది. భరత్ నాలుగేండ్లుగా ఒంటరిగానే ఉంటున్నాడు. తల్లి కూడా కొడుకును చివరిసారిగా చూసేందుకు ఎందుకు రాలేదు?. భరత్‌ను కడసారి కూడా చూసేందుకు రాలేదంటే బలమైన కారణం ఏంటీ? సోదరుడు రఘు అక్కడే ఉన్న ఒక జూనియర్ ఆర్టిస్ట్‌తో తలకొరివి పెట్టించడమేంటని సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తోంది. డ్రగ్స్‌కు బానిసై, కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని పలువురు అంటున్నారు. కాగా, మొదటి నుంచీ వివాదాస్పదుడైన భరత్ మంచి క్రికెట్ ప్లేయర్. సినీ తారల మ్యాచ్‌లు జరిగినప్పుడల్లా వాటిలో పాల్గొనేవాడు. అతడు మంచి బౌలర్ అయి పలువురు చెప్తున్నారు. భరత్‌పై గతంలో మాదకద్రవ్యాలు, పోలీసులతో దురుసు ప్రవర్తన కేసులు సైతం నమోదయ్యాయి.
తన సోదరుడి అంత్యక్రియలకు హాజరుకాలేనని టాలీవుడ్ ప్రముఖ హీరో రవితేజ అన్నారు. చిధ్రమైన తన తమ్ముడి భౌతిక కాయాన్ని చివరి చూపు చూసి భరించలేనని, దీన్ని అర్థం చేసుకోవాలంటూ రవితేజ మీడియాకు, మిత్రులకు చెప్పారు.