అమెరికాలోని డాలస్ నగరంలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు బీఆర్ఎస్ రజతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్…తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నామని తెలిపారు. మిమ్మల్ని చూసి తెలంగాణ గడ్డ గర్విస్తున్నది. ఖండాలను దాటి తెలంగాణ నైపుణ్యాన్ని చాటిన మీ అందరికీ వందనం. తెలంగాణకు ప్రతీకగా నిలిచిన మీ అందరికీ అభివందనం. అమెరికాలోని తెలంగాణవాసులను చూసి తెలంగాణ తల్లి గర్విస్తున్నది. పుట్టిన గడ్డకు వేలాది మైళ్ల దూరంలో ఉన్నా బతుకమ్మను మరచిపోలేదు. బతుకును ఇచ్చిన తెలంగాణను మీరు మరచిపోలేదు అన్నారు.
2015లో పెట్టుబడుల కోసం అమెరికాలో తిరుగుతూ డాలస్‌కు వచ్చాం. పదేండ్ల తర్వాత ఇక్కడకు వచ్చి చూస్తే కేసీఆర్ దూతలుగా ఎన్నో చేసి చూపించారు. జీవితంలో ఎన్నో కలలు కంటారు. కొందరు వాటిని సాకారం చేసుకుంటారు అన్నారు. 2023లో ఓడిపోయినా తెలంగాణను ప్రేమించడంలో ఎప్పుడూ ముందున్నాం. మళ్లీ మూడేండ్లలో తిరిగి బిడ్డ తెలంగాణ తల్లి వద్దకు చేరుతుంది అన్నారు.
కేసీఆర్ విప్లవాత్మకమైన అద్భుతమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టారు. తుంగతుర్తి, డోర్నకల్, మహబూబ్‌సాగర్‌కు నీళ్లు వచ్చాయంటే కాళేశ్వరం వల్లనే. నాలుగేండ్లలోనే కాళేశ్వరం నిర్మించిన ఘటన కేసీఆర్‌కు దక్కుతుంది. 45 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అక్షయ పాత్ర కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 19 రిజర్వాయర్లు. 371 పిల్లర్లలో 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని విషప్రచారం చేశారు. లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. హైదరాబాద్‌కు వచ్చిన సూపర్‌స్టార్ రజనీకాంత్ న్యాయార్క్‌లో ఉన్నానా అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వెనుకబడిన వర్గాల అభివృద్ధికి కృషి చేశాం. ప్రతి జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ సర్కార్. విదేశీ స్కాలర్‌షిప్‌లతో విదేశీ విద్యకు అవకాశం కల్పించాం. ఇక్కడి విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిసింది. అవసరమైతే లీగల్ సెల్ ఏర్పాటు చేసి వారికి అండగా నిలబడతాం అని తెలిపారు. విజ్ఞాన ఆధారిత దేశాలు అభివృద్ధి సాధిస్తాయి. విదేశాల్లో జాబ్స్ పోతాయనే ఆందోళన నెలకొన్నది. మార్పులకు అనుగుణంగా మనం కూడా మార్పును సాధించాలి. ఎదురయ్యే సాకేంతిక సమస్యను ఎదుర్కొని పరిష్కరించుకోవాలి. సంస్థకరణలకు ఆధ్యుడు, ప్రపంచీకరణకు తలుపులు తెరిచింది పీవీ నరసింహారావు. జన్మభూమి రుణం తీర్చుకోండి.. పెట్టుబడులు పెట్టండి. మీ అందరికీ బీఆర్ఎస్ అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు.
Also Read:ఓటీటీలో ‘చౌర్య పాఠం’..

