కక్కలేక మింగలేక అన్న చందంగా తయారైంది తెలంగాణ కమలనాథుల పరిస్థితి. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్న బీజేపీ చీఫ్ అమిత్ షా ఇటీవల నల్గొండ జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. మూడు రోజల పాటు జిల్లాలో పర్యటించిన అమిత్ స్థానిక నేతలతో పాటు రాష్ట్ర నాయకత్వంపై ఒకింత అసహనాన్ని వ్యక్తం చేశారు.
నల్గొండ టూర్ ముగించుకుని హస్తీనకు వెళ్లిన షా క్షేత్రస్ధాయిలో పార్టీ పరిస్ధితి, నాయకుల పనితీరుపై సీక్రెట్ సర్వే చేయిస్తున్నారట. పార్టీ పునాదులనుంచి ప్రక్షాళన చేయాలనుకుంటున్న అమిత్ షా జనంలో బలమున్న నేతలకు పెద్ద పీట వేయాలని అంతగా బలం లేకుండా షో పుటప్ చేస్తున్న నేతలను ఏరిపారేయాలనీ నిర్ణయించారట. అందుకే తెలంగాణలో అసలు కమల బలం ఎంత ? ఎక్కడెక్కడ అవకాశాలున్నాయి. ఏ నేత సత్తా ఎంత అన్నది తేల్చేయడానికి సొంతంగా సర్వేలు జరిపిస్తున్నారు.
అమిత్ షా సర్వే నిర్ణయంతో కమలదళం నేతలకు చెమటలు పడుతున్నాయి. నియోజక వర్గాల వారీగా సర్వేలు జరిపి నివేదికలు తెప్పించుకుంటుండంతో ఇన్నాళ్లూ ధీమాగా ఉన్న నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నియోజకవర్గంలో గతంలో ఎవరు పోటీ చేశారు? వాళ్లకి వచ్చిన ఓట్లు ఎన్ని? వచ్చే ఎన్నికల్లో ఏ అభ్యర్ధి అయితే బెటర్ ఛాయిస్ అవుతుందన్న అన్న దిశగా అమిత్ షా లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుతం పోటీ చేయాలనుకున్న వారితో పాటూ సెకండ్ కేడర్ లో ఉన్న వారి పేర్లు కూడా సర్వేలో ప్రస్తావిస్తుండడంతో తమకు సీటు ఉంటుందా.. లేదా.. అనే అనుమానం మాజీ నేతలను పట్టి పీడిస్తోంది.
మరోవైపు సీనియర్ నేతలు తన కార్యక్రమాన్ని నిర్వహించడంలో అంత సఫలం కాలేదని , ఏర్పాట్లు మరింత జాగ్రత్తగా జరగవలసి ఉందని ఆయన అబిప్రాయపడ్డారట. పార్టీ నేతల అంతరంగిక సమావేశంలో ఒక నేత షా టూర్ బ్రహ్మాండంగా జరిగిందని ఆయనతోనే అనగానే, అది వాస్తవం కాదని ఆయన కుండబద్దలు కొట్టారట.ఇక బిజెపి అద్యక్షుడు లక్ష్మణ్ కు, ఇతర నేతలకు మధ్య సమన్వయ లోపం ఉన్నట్లు షా గమనించారు. శాసనసభలో బిజెపి పక్ష నేత కిషన్ రెడ్డి అలిగిన విషయాన్ని గమనించి ఆయనకు క్లాస్ పీకారట.
కొంతమంది నేతలు తమదారి తాము చూసుకునేందుకు రెడీ అవుతున్నారట. తమకు కలిసొచ్చే పార్టీలో చేరటం ద్వారా రాజకీయ భవిష్యత్‌కు అడ్డంకులు లేకుండా పునాదులు వేసుకునేందుకు సిద్దమవుతున్నారట. దీంతో అమిత్ సైలెంట్ స్కెచ్ ముంచేదెవరిని? తేల్చేదెవరినో? తేలక నేతలు తికమకపడుతున్నారు.