అనిశ్చితికి మారుపేరైన పాకిస్థాన్ సంచలన విజయం నమోదు చేసింది. చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ ఘన విజయం సాధించి ట్రోఫీని చేజిక్కించుకుంది. ఏకపక్షంగా సాగిన పోరులో పాక్‌దే పైచేయి అయింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 338 పరుగులు చేసి భారత్ ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. పాక్ బ్యాట్స్‌మెన్‌లలో అజర్ అలీ 59, ఫఖర్ జమన్ 114, బాబర్ ఆజం 46, షోయబ్ మాలిక్ 12, మొహమ్మద్ హఫీజ్ 57, (నాటౌట్), ఇమాద్ వాసిమ్ 25 (నాటౌట్) పరుగులు చేశారు. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్ధిక్ పాండ్యా, కేదార్ జాదవ్ చెరో వికెట్ తీశారు.
అనంతరం 339 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 30.3 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైంది. భారత బ్యాట్స్‌మెన్‌లలో శిఖర్ ధవన్ (21), యువరాజ్ సింగ్ (22), హార్ధిక్ పాండ్యా (76), రవీంద్ర జడేజా (15) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగిలిన వారెవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్, హసన్ అలీ చెరో మూడు వికెట్లు తీయగా షాదాబ్ ఖాన్ 2, జునైద్ ఖాన్ 1 వికెట్ నేలకూల్చాడు.