దేశమంటే మట్టి కాదోయో దేశమంటే మనుషులోయ్ అంటూ కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రసంగించి కొన్ని రాష్ట్రాలకే పెద్ద పీట వేయడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 2025-26 బడ్జెట్ తన రాజకీయ అవసరాలే ఉపయోగించుకున్నది తప్ప, దేశ సమ్మిళిత వృద్ధిని ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు అని దుయ్యబట్టారు.
2024లో ఆంధ్రప్రదేశ్ కోసం, 2025 ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల కోసం బడ్జెట్ పెట్టారు… 2026లో యూపీ కోసం, 2027లో గుజరాత్ కోసం బడ్జెట్ పెడుతారా? అని నిలదీశారు. ఇది కేంద్ర బడ్జెట్‌లా లేదు.. కేవలం మూడు, నాలుగు రాష్ట్రాల బడ్జెట్‌లాగా ఉందని దుయ్యబట్టారు.
తెలంగాణతో తమకు బంధం లేదని బడ్జెట్ ద్వారా మరోసారి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరూపించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం బడ్జెట్ ద్వారా నిధులు రాబట్టుకోవడంలో సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారన్నారు.నిధుల కేటాయింపు సంగతి దేవుడెరుగు, విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను కూడా కేంద్రం నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. ఎన్నికలు దగ్గర ఉన్నాయని ఇప్పటి బడ్జెట్‌లో బిహార్‌కు మరిన్ని వరాల జల్లు కురిపించారు.
తెలంగాణకు ప్రయోజనాల కోసం, తెలంగాణ ప్రజల కోసం ఎప్పటికైనా పోరాడేది బిఆర్ఎస్ పార్టీయేనని మరోసారి రుజువైంది. తెలంగాణ ప్రయోజనాలు కాపాడటంలో బిజేపీ, కాంగ్రెస్ పార్టీలు వైఫల్యం చెందుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
also Read:‘తండేల్’..పెద్ద విజయం సాధించాలి