మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి పాలనచేతగాక గత ప్రభుత్వ పదేళ్ల పాలనపైన చేస్తున్న అనేక దుష్ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే చెంపపెట్టు లాంటిదని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వేలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అనేక దుష్ప్రచారాలకు ప్రాపగాండాకు సాధికారిక సమాధానాన్ని ఇచ్చిందని కేటీఆర్ అన్నారు. ఆర్థిక సర్వేలో పేర్కొన్న అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రం సాధించిన ప్రగతి, అర్ధిక మైలురాళ్లు 10 సంవత్సరాల మా ప్రభుత్వ పరిపాలనకు తార్కానమని… తెలంగాణ మోడల్ విజయవంతం అయిందనేందుకు సాక్ష్యం అన్నారు. అతి తక్కువ కాలంలో అనేక విజయాలు అందుకున్న రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టేందుకు మా 10 సంవత్సరాల పరిపాలన దోహదం చేసిందని కేటీఆర్ అన్నారు. ఇప్పటికైనా అభివృద్ధి చెందిన తెలంగాణను అధపాతాళానికి తీసుకెళ్లకుండా పరిపాలన పైన దృష్టి సారించి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాయితీగా పని చేయాలని కేటీఆర్ సూచించారు.
కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే 2024-25 తెలంగాణ రాష్ట్రం గత దశాబ్దంలో సాధించిన సమగ్ర, సమతుల, సమగ్రాభివృద్ధిని మరోసారి ప్రతిబింబించిందన్నారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని సర్వే స్పష్టంగా తెలియజేస్తోందన్నారు.
ఆర్థిక సర్వే ప్రకారం, తెలంగాణ స్వంత ఆదాయ వనరులలో (State-Owned Tax Revenue – SOTR) దేశంలోనే అగ్రస్థానంలో ఉందని, రాష్ట్రం 88% ఆదాయాన్ని స్వయంగా సేకరించుకోవడం తెలంగాణ ఆర్థిక వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ఆరోపణలకు ఇది గట్టి సమాధానమని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కేంద్రంపై ఆధారపడకుండా, తెలంగాణ స్వంతంగా ఆదాయాన్ని పెంచుకోవడం బీఆర్ఎస్ హయాంలో అమలైన ఆర్థిక పరిపాలనా నైపుణ్యానికి నిదర్శనమని పేర్కొన్నారు.
తెలంగాణలో మొత్తం సాగుబడి భూమిలో 90% కు పైగా ప్రాంతం సాగునీటి సదుపాయాన్ని పొందుతోందని సర్వే చెప్పిన వాస్తవం సాగునీటి ప్రాజెక్టులపైన కాంగ్రెస్ ప్రాపగండాను తిప్పికొట్టిందన్నారు. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి విప్లవాత్మక ప్రాజెక్టుల కారణంగా సాధ్యమైందని, కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరం పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆర్థిక సర్వే గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోనే అగ్రస్థాయిలో కొనసాగుతుండటం బిఅర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రణాళికల విజయాన్ని చూపిస్తున్నాయన్నారు.
2017లో గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ (GES) సందర్భంగా ప్రకటించిన WE-HUB ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తల పొత్సాహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన WE-HUB, ఇప్పుడు రాష్ట్ర మహిళలకు అద్భుత అవకాశాలను అందిస్తూ, వేలాది స్టార్టప్లకు ప్రోత్సాహం ఇస్తోందన్నారు.
తెలంగాణ దేశంలోనే 100% తాగునీటి సరఫరా అందించిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని, ఈ ఘనత మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ద్వారానే సాధ్యమైందన్నారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన ఈ ప్రాజెక్ట్ విజయవంతమై, ప్రతి ఇంటికి నల్లా నీరు అందజేస్తోందని, దేశంలోని అనేక రాష్ట్రాలకు మిషన్ భగీరథ ఆదర్శంగా నిచిందని కెటిఅర్ తెలిపారు.
సర్వే ప్రకారం, హై పెర్ క్యాపిటా GSVA (Gross State Value Added) తో తెలంగాణ సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని, తెలంగాణ ఐటి, స్టార్టప్, ఫిన్టెక్ రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. గ్లోబల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా కొనసాగినదానికి నిదర్శనమన్నారు.
ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక సర్వే తిప్పికొట్టాయని, తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా, ఆర్థిక సర్వే వంటివి కాంగ్రెస్ కి కనువిప్పు కలిగిస్తాయన్నారు. ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటి పారుదల వంటి అన్ని రంగాల్లోనూ తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో అగ్రస్థానంలో నిలిచిందని, ఈ నిజాలు ఎవరికీ ఇష్టం లేకపోయినా, తెలంగాణ ప్రజలకు మేలు చేసిన హయాం ముమ్మాటికీ బీఆర్ఎస్ పాలననే అని, కెసిఅర్ గురుతులు, చరిత్రను, తెలంగాణకు ఆయన నాయకత్వంలో అందిన ఫలాలును ఏవరు చేరపలేరని కేటీఆర్ అన్నారు.
Also Read:జన్మతః పౌరసత్వంపై ట్రంప్..మరోసారి కామెంట్!

