తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయం పరిసరాలలో మరింతగా అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ చేపట్టాలని టిటిడి ఈవో జె.శ్యామల రావు అధికారులను ఆదేశించారు. టిటిడి జేఈవో శ్రీ వి వీరబ్రహ్మం, టిటిడి అధికారులతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి విజన్ లో భాగంగా తిరుచానూరు ఆలయం పరిసరాలలో భక్తులలో మరింత భక్తిభావం, ఆహ్లాదాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు సమన్వయంతో మరింత ఆకర్షణీయంగా ,సౌకర్య వంతంగా ఉండేలా ఆర్కిటెక్చర్ నిపుణుల సహకారంతో మాస్టర్ ప్లాన్ ను సిద్దం చేయాలని సూచించారు.
ముందుగా తోళప్ప గార్డెన్ ను ఈవో పరిశీలించారు. తోళప్ప గార్డెన్ లోని కళ్యాణ మండపాలను ఎప్పుడు నిర్మించారు, సౌకర్యాలు ఎలా ఉన్నాయి, కళ్యాణ మండపాలలో తాజా పరిస్థితులు, తదితర అంశాలపై ఇంజనీరింగ్ అధికారులతో ఈవో మాట్లాడారు. కళ్యాణ మండపాలు నిర్మించి ఇప్పటికే 60 సంవత్సరాలు పూర్తి అయినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఈవోకు నివేదించారు.
మీడియాతో ఈవో మాట్లాడుతూ, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం టిటిడి ఆలయాల్లో చాలా ముఖ్యమైన ఆలయమని, సరాసరి రోజుకు 25 వేల పైచిలుకు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని తెలిపారు. భక్తుల రద్దీ రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో పరిమిత స్థలంలోనే టికెట్ల జారీ, లడ్డూ కౌంటర్లు ఉండడం మూలంగా భక్తులకు చాలా ఇరుకుగా ఉండడం వల్ల భక్తులకు అసౌకర్యంగా ఉంటోందన్నారు. ఇప్పటికే ఉన్న పీఏసీని మరో చోటికి మార్చే ఆలోచన చేస్తున్నామన్నారు. ఆలయ పరిసరాల్లో టౌన్ ప్లానింగ్ నిపుణుల సహకారంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను కోరారు.
అటు తర్వాత ఫ్రైడే గార్డెన్ ను పరిశీలించారు. ఫ్రైడే గార్డెన్ లో భక్తులు ఆహ్లాదంగా ఉండేలా ఏర్పాట్లు చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ఆలయ సమీపంలోని టిటిడి స్థలాన్ని, నాలుగు మాడ వీధుల్లో అధికారులతో కలిసి కలియ తిరిగారు.

