భక్తులనుండి టిటిడి అమలు చేస్తున్న వివిధ ఏర్పాట్లపై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ సిస్టం ద్వారా శ్రీవారి సేవకుల సహాయంతో అభిప్రాయ సేకరణ చేస్తూ వారికి మరింత సౌకర్యవంతమైన దర్శనం, ఇతర వసతులు పారదర్శకంగా కల్పించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అన్నారు.
తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనం ప్రాంగణంలో ఆదివారం ఉదయం 76వ గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న అదనపు ఈవో జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ, పంద్రాగస్టు తరువాత భారత రాజ్యాంగం రూపొందించబడిన ప్రత్యేకమైన రోజుకు గుర్తుగా గణతంత్ర దినోత్సవం ప్రతి ఏటా గంగా మనం నిర్వహించుకుంటున్నాం అని అన్నారు.
ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ ఉద్యోగులు సమిష్టి కృషితో పని చేసి మరింత మెరుగైన సేవలందించాలని పిలుపునిచ్చారు. గత ఏడాది అక్టోబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా నిర్వహించామన్నారు.
భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాదాలు, క్యూలైన్ల నిర్వహణ మార్పులు చేశామన్నారు. భక్తులకు మరింత నాణ్యమైన అన్నప్రసాదాలు అందించేందుకు అత్యాధునిక యంత్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. జనవరి 10 నుండి 19వ తేదీ వరకు 6.80 లక్షల మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తాము ఫీడ్ బ్యాక్ సిస్టమ్ ద్వారా భక్తుల నుండి సేకరించిన అభిప్రాయాల్లో దాదాపు 96 శాతం మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లు చాలా బాగున్నాయని తెలపడం జరిగిందన్నారు.
తిరుమలలో వసతి గదుల కేటాయింపులో ఉన్న సమస్యలు పరిష్కరించి, మరి కొన్ని కాటేజిలో మరమ్మతులు త్వరగా పూర్తి చేసి భక్తులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. తిరుమలలో అన్నదానం, పారిశుద్ధ్యం, విద్యుత్ శాఖ, ఉద్యానవన శాఖ వంటి విభాగాలు బాగా పని చేస్తున్నాయని, సమిష్టి కృషితో అన్ని విభాగాలలో వంద శాతం మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు.
టీటీడీ ఐటి విభాగాన్ని బలోపేతం చేసేలా చర్యలు తీసుకొని భక్తులకు సులభతరంగా సేవలు అందిస్తామన్నారు. టీటీడీ ఇటీవల ప్రవేశపెట్టిన ఈ హుండీ విధానం మంచి ఫలితాలు ఇస్తున్నదన్నారు.తిరుమలలో పలుచోట్ల ఏర్పాటు చేసిన కియోస్క్ లలో యుపిఐ ద్వారా భక్తులు సులభతరంగా విరాళాలు అందిస్తున్నారని చెప్పారు. అనునిత్యం తిరుమలకు విచ్చేసే కోట్లాదిమంది భక్తులకు కొన్ని సమయాల్లో అందిస్తున్న సౌకర్యాలలో చిన్నపాటి సమస్యలు వస్తుంటాయన్నారు. అట్లాంటి వాటిని కూడా అధిగమించి భక్తులకు సౌకర్యవంతమైన సేవలు కల్పించడంలో టీటీడీ అహర్నిశలు కృషి చేస్తుందని ఆయన తెలిపారు.
Also Read:పద్మ అవార్డులపై విజయశాంతి

