వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ షర్మిల. అలాగే అమిత్ షాకు చురకలు అంటించారు. అమిత్ షా వ్యాఖ్యలు చూస్తుంటే ఊసరవెల్లి సైతం సిగ్గుపడుతుందని విమర్శించారు. వైసీపీ పాలన ఓ విపత్తు అని అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఐదేళ్లలో విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చొని వేడుక చూశారా అని నిలదీశారు.
రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం పనులను ఆపితే ఒక్కనాడైనా అడిగారా అని అమిత్ షాను నిలదీశారు. ఐదేళ్ల పాటు జగన్ మీకు దత్తపుత్రుడు.. ఆడించినట్లు ఆడే తోలుబొమ్మగా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో మీ బిల్లులకు మద్దతు పలికే రబ్బర్ స్టాంప్ అని దుయ్యబట్టారు.
మీ ఇష్టారాజ్యంగా ఐదేళ్లు వైసీపీనీ వాడుకొని, రాష్ట్ర సంపదను దోచుకొని, ఇప్పుడు విధ్వంసం జరిగిందని ముసలి కన్నీరు కార్చితే నమ్మే అమాయకులు రాష్ట్ర ప్రజలు కారని స్పష్టం చేశారు. రాజధాని లేని రాష్ట్రంగా ఐదేళ్లు పాలన చేస్తుంటే కేంద్రానికి కనిపించలేదా అని నిలదీశారు. భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంటే ఒక్కటైనా బయటపెట్టారా నిలదీశారు.పదేళ్ల పాటు విభజన హామీలు నెరవేర్చకుండా మోసం చేసి, ఇప్పుడు అండగా ఉంటామని.. రూ.3లక్షల కోట్లు ఇస్తామని.. పూర్వవైభవం తెస్తామనే మీ మాటలు మరో మోసానికి నిదర్శనమని విమర్శించారు. గత వైసీపీ పాలనపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని అమిత్ షాను డిమాండ్ చేశారు.
Also Read:పింక్ బుక్లో రాస్తున్నాం…పోలీసులు జాగ్రత్త!