ప్రముఖ ఆథ్యాత్మిక ప్రవచన కర్త బ్రహ్మర్షి శ్రీ డా. చాగంటి కోటేశ్వర రావు ప్రతి ఏడాది జనవరి మాసంలో తిరుమల వచ్చి శ్రీవారిని సందర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా జనవరి 14న శ్రీవారి దర్శనం, జనవరి 16వ తేదీ సాయంత్రం తిరుపతి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇచ్చేందుకు 2024, డిసెంబర్ 20న టిటిడి ప్రొసిడింగ్స్ ఇచ్చింది. డా. చాగంటి కోటేశ్వర రావు కి ఉన్న కేబినేట్ ర్యాంక్ ప్రోటోకాల్ ప్రివిలేజ్ ప్రకారం జనవరి 14న శ్రీవారి దర్శనం ఏర్పాట్లను చేసింది. అందులోభాగంగా, రాంబగీఛ గెస్ట్ హౌస్ నుంచి శ్రీవారి ఆలయానికి వారిని తీసుకెల్లేందుకు బగ్గీస్ ను, శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా అనుమతించేందుకు టిటిడి ఏర్పాట్లను చేసింది.
అయితే వయసు రీత్యా శ్రీవారి ఆలయానికి బయోమెట్రిక్ ద్వారా వెళ్లే సదుపాయం ఉన్నా వారు సున్నితంగా తిరస్కరించడం జరిగింది. పలువురు ప్రముఖులు, సాధారణ భక్తుల తరహాలోనే వైకుంఠం కాంప్లెక్స్ నుండి శ్రీవారి ఆలయానికి చేరాలని వారే స్వయంగా సూచించారు. వారి సూచనల మేరకు వారే స్వయంగా వైకుంఠం కాంప్లెక్స్ నుంచి ఆలయానికి చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు.
అదేవిధంగా జనవరి 8వ తేదీన తిరుపతిలో జరిగిన తోపులాట ఘటన నేపథ్యంలో శ్రీ చాగంటి వారి ప్రవచన కార్యక్రమాన్ని మరొక తేదీకి వాయిదా వేస్తే బాగుంటుందని వారి దృష్టికి టిటిడి అధికారులు తీసుకెళ్లగా, ఈ విన్నపాన్ని చాగంటి అంగీకరించారు. తదుపరి వారి అపాయింట్మెంట్ తేదీలను మరోసారి తీసుకుని ప్రవచనాలు ఏర్పాటు చేసేందుకు టిటిడి నిర్ణయించింది.
వాస్తవం ఇలా ఉండగా బయోమెట్రిక్ ద్వారా కాకుండా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుంచి శ్రీవారి ఆలయంలోకి అనుమతించారని, చివరి నిమిషంలో పరిపాలనా కారణాల రీత్యా శ్రీ చాగంటి వారి ప్రవచనాల కార్యక్రమాన్ని టిటిడి రద్దు చేసినట్లు టిటిడిని పలుచన చేసేలా వాస్తవాలను వక్రీకరించి అసత్యపు వార్తను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాము.
Also Read:అర్హులైన అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి: హరీశ్ రావు