దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్ సమర్పకురాలు. నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది. ఉత్తమ బాల నటిగా సుకృతి వేణి కూడా పురస్కారం పొందారు. జనవరి 24న చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను సూపర్‌స్టార్, ప్రిన్స్ మహేష్‌బాబు తన సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ” గాంధీ తాత చెట్టు ట్రైలర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది. అందరి మనసులను హత్తుకునే సినిమాలా ఇది అనిపిస్తుంది. సుకృతికి మరియు ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు” అంటూ ప్రిన్స్ మహేష్‌బాబు తన ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ట్రైలర్ చూస్తుంటే ” గాంధీ పేరు పెట్టుకున్న ఓ అమ్మాయి.. ఆయన బాటను, సిద్దాంతాలను అనుసరిస్తూ, తన తాతకు ఇష్టమైన చెట్టును, తన ఊరును ఎలా రక్షించుకుంది అనే కథాంశంతో సినిమా తెరకెక్కినట్లుగా తెలుస్తుంది. గాంధీగా సుకుమార్, కుమార్తె సుకృతి వేణి ఈ సినిమాలో నటించారు. ట్రైలర్ అందరి హృదయాలకు హత్తుకునే విధంగా ఉంది” అనిపిస్తుంది. ఈ సందర్భంగా ట్రైలర్ విడుదల చేసిన సూపర్‌స్టార్ మహేష్‌బాబుకు నిర్మాతలు, దర్శకురాలు, చిత్ర సమర్పకురాలు తబితా సుకుమార్ తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు.
ఈ సందర్భంగా దర్శకురాలు పద్మావతి మల్లాది మాట్లాడుతూ ” ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా చూసిన ద్వేషాలు, అసూయ..ఇలా ఓ నెగెటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం.. గొడవలు ఇలా ఎన్నో ఘర్షణలు కనిపిస్తున్నాయి.ఇక సాధారణంగా మనకు అహింస అనగానే మనకు మన జాతిపిత మహాత్మగాంధీ గుర్తొస్తారు. ఇలాంటి తరుణంలో గాంధీ గారి సిద్ధాంతాలు అభిమానిస్తూ, ఆయన బాటను అనుసరించే ఓ పదమూడేళ్ల అమ్మాయి తను పుట్టిన ఊరిని కాపాడుకోవడం కోసం ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చూపించాల్సిన సినిమా. అందరి హృదయాలను హత్తుకునే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి. చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఓ అనీర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది. ఈ నెల 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నాం’ అన్నారు. సుకృతి వేణి, ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాష్, నేహాల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: రీ, సినిమాటోగ్రఫీ: శ్రీజిత్ చెర్వుపల్లి, విశ్వ దేవబత్తుల, ఎడిటింగ్: హరిశంకర్ టీఎన్, పాటలు: సుద్దాల అశోక్ తేజ, కాసర్ల శ్యామ్, విశ్వ, ప్రొడక్షన్ డిజైన్ వి.నాని పాండు, కో పొడ్యూసర్: అశోక్ బండ్రెడ్డి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అభినయ్ చిలుకమర్రి, రచన-దర్శకత్వం : పద్మావతి మల్లాది
Also Read;చంద్రబాబు చెప్పినవన్నీ అబద్దాలే: జగన్